రాజమండ్రి బహిరంగ సభలో జగన్ పాలనలో అవినీతిని ప్రధాని నరేంద్ర మోడీ ఏకిపారేశారు.
నా ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు….రాజమండ్రి వాసులందరికీ నమస్కారాలు అంటూ ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ఆదికవి నన్నయ నడయాడిన నేల ఇదని ఇక్కడే ఆయన తెలుగులో తొలి కావ్యాన్ని రచించారని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. ఈ గడ్డ నుంచి ఏపీలో నవ చరిత్ర మొదలుకాబోతుందని తనకు స్పష్టంగా తెలుస్తోందని మోదీ అన్నారు.
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జనసేనాని పవన్ కళ్యాణ్ , ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు హాజరయ్యారు. ప్రజలు వేసే ఓటుతో ఏపీ అభివృద్ధి యాత్రలో కొత్త అధ్యాయం ప్రారంభంకానుందని మోడీ అన్నారు. జగన్ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్ లో సాగుతోందని, అభివృద్ధికి మాత్రం బ్రేక్ పడిందని అన్నారు. మూడు రాజధానులు అంటూ భారీ స్థాయిలో ఖజానాను లూటీ చేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. జగన్ పాలన దుష్ఫలితాలు ఇలాగే ఉంటాయన్నారు.
జగన్ ప్రభుత్వంలోని నేతలు అవినీతి మాత్రమే చేయగలరని, అందుకే ఖజానా పూర్తిగా ఖాళీ అయిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక వ్యవహారాల నిర్వహణ అసలు తెలీదని, ప్రజాసేవ చేయాలన్న కోరిక లేదని అన్నారు. పోలవరానికి కేంద్రం 15 వేల కోట్లు ఇచ్చిందని, కానీ వైసీపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును ముందుకు సాగనీయకుండా బ్రేక్ వేసిందని ఆరోపించారు. వికసిత భారత్ లో వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా భాగమని, గత పదేళ్లలో ఏపీ అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నామని అన్నారు.
ఎన్టీఆర్ ఎన్నో పౌరాణిక పాత్రలలో నటించి ప్రజల హృదయాలను ఆకట్టుకున్నారని కొనియాడారు. ఏపీని గతంలోని చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి పథంలో తీసుకుపోయిందని, అన్నిట్లో రాష్ట్రాన్ని అగ్ర భాగాన నిలిపిందని ప్రశంసించారు. కానీ, వైసీపీ ప్రభుత్వం ఆ అభివృద్ధిని పట్టాలు తప్పించిందని, ప్రజల మేలు కోసం పనిచేయడానికి బదులు రాష్ట్రాన్ని భారీ అప్పులు ఊబిలో కూరుకుపోయేలా చేసిందని ఆరోపించారు. ఏపీలో వైసీపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఓట్లు అడిగేందుకు అర్హత లేదన్నారు. వైసీపీ ఏపీ ప్రజానీకం పూర్తిగా తిరస్కరించిందని, ఐదేళ్లు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వారు దుర్వినియోగపరిచారని ఆరోపించారు.
దేశంలో ఎన్నికలు జరుగుతున్న ప్రతి చోటా ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయం సాధించడం తధ్యమని, ఐదేళ్లపాటు ఇక్కడ ఏపీలో ప్రభుత్వం ఉండబోతుందని జోస్యం చెప్పారు.