దేశానికి ప్రధానమంత్రులుగా పలువురు వ్యవహరించారు. వారి తీరుకు.. పదేళ్లుగా ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీకి పోలికే ఉండదని చెప్పాలి. ప్రతి అంశంలోనూ ఆయన మార్కు ప్రత్యేకంగా ఉంటుంది. మిగిలిన అన్నీ అంశాల్ని వదిలేసి.. ప్రజాస్వామ్యంలో ఫోర్తు ఫిల్లర్ గా వ్యవహరించే మీడియా విషయానికే వద్దాం. ప్రధాని హోదాలో ప్రధాన మీడియాను పట్టించుకున్నదే కనిపించదు. ఆచితూచి అన్నట్లు మాట్లాడే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం తన పదేళ్ల పాలనలో.. ఏడాదికి ఒక్కసారైనా మీడియా ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేయటం చేశాం. కానీ.. నరేంద్ర మోడీ తీరు వేరు. ఆయన తన పదేళ్ల పాలనలో మీడియా ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది లేదు.
తాను ఎంపిక చేసుకున్న కొన్ని మీడియా ప్రతినిధులతోనే ఆయన మాట్లాడేవారు. అది కూడా విదేశీ జర్నలిస్టులకే ఆయన ఇంటర్వ్యూలు వెళ్లేవి. అందుకు భిన్నంగా తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వేళ.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక ప్రముఖ మీడియా హౌస్ కు ఇంటర్వ్యూ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ప్రధానిగా మోడీ పని చేసిన పదేళ్లలో ఆయన ఒక తెలుగు జర్నలిస్టుకు.. ఒక తెలుగు మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు. ఆ లోటును ‘ఈనాడు’ తీర్చింది.
తాజాగా ఈనాడుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇంతకూ ప్రధాని మోడీని ఇంటర్వ్యూ చేసిన ఎం. నాగేశ్వరరావు ఎవరు? ఈనాడులో ఆయన స్థాయి ఏమిటి? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్న విషయాలు మీడియా వర్గాలకు సుపరిచితమే. మిగిలిన వారికి పెద్దగా తెలీదు. ఈనాడు లాంటి సంస్థలో ఏపీకి ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఎం. నాగేశ్వరరావు గతంలో ఈనాడు జర్నలిజం స్కూల్ కు ప్రిన్సిపల్ గా వ్యవహరించారు. అన్నింటికి మించి..ఈనాడుకు సంబంధించిన అత్యంత కీలకమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు.
ఈనాడులో రామోజీరావు తర్వాత దినపత్రిక వ్యవహారాల్ని ఆయన పెద్ద కొడుకు కిరణ్ పర్యవేక్షిస్తుంటారు. ఆయనకు రెండు చేతులుగా వ్యవహరించే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరు ఈ ఎం. నాగేశ్వరరావు. మరొకరు డీఎన్ ప్రసాద్. ఈ ఇద్దరిలో నాగేశ్వరరావు ఈనాడు ఏపీకి ఎడిటర్ గా వ్యవహరిస్తుంటే.. తెలంగాణ ఈనాడుకు ఎడిటర్ గా డీఎన్ ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన మీడియా హౌస్ లో మొదటిసారి ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసే అరుదైన అవకాశాన్ని నాగేశ్వరావు సొంతం చేసుకున్నారని చెప్పాలి. నాగేశ్వరరావు విషయానికి వస్తే.. ఆయనది గుంటూరు జిల్లాకు చెందిన వారు. దశాబ్దాల క్రితం ఈనాడులో కిందిస్థాయి ఉద్యోగిగా చేరి.. అంచలంచెలుగా ఎదిగారు.