తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే ఉగాది పర్వదినాన కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు…. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరపున గూడూరులో ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలో సీఎం జగన్‌పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్‌కు ఒక్క చాన్స్ ఇచ్చి ప్రజలు మోసపోయారని, జగన్ కు ఇదే చివరి అవకాశం కావాలని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
గూడూరులో రోడ్లన్నీ గుంతలమయం అని, కరోనాను ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోయిందని చంద్రబాబు దుయ్యబట్టారు. పారాసిటమాల్, బ్లీచింగ్ తో కరోనాను ఎదుర్కోవచ్చంటూ జగన్ నిర్లక్షపూరిత వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో దుమారం రేపాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కరోనాతో సహజీవనం చేయాలంటూ జనజీవన వ్యవస్థని జగన్ నాశనం చేశాడని మండిపడ్డారు.
కరోనా విలయతాండంవ చేస్తుంటే జగన్ మాత్రం మద్యం షాపులు బార్లా తెరిచారని, పవిత్రమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులను మద్యం దుకాణాల దగ్గర కాపలా పెట్టాడని మండిపడ్డారు. జగన్ సొంత బ్రాండ్ల మద్యం సొంత షాపుల్లో అమ్మడం దారుణమని నిప్పులు చెరిగారు. కమీషన్లకు కక్కుర్తిపడి ఇసుక టెండర్లు సొంత మనుషులకిచ్చాడని దుయ్యబట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీలో ఇసుక కరువైందని,ఇసుక ధరలకి రెక్కలొచ్చి 45 లక్షల మంది ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి జగనే కారణమని విమర్శించారు.
ఇసుక, మద్యం అన్నింటిలోనూ అక్రమాలేని, సహజవనరులని జగన్ దోచేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్‌కి భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉందని, సిమెంట్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, తమ హయాంలో సిమెంట్ ధరలు నియంత్రించామని అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, ఏపీలో రూపాయి విలువ పడిపోయి…ద్రవ్యోల్బణం పెరగడానికి జగన్ పాలనే కారణమని దుయ్యబట్టారు.