దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావిడి మొదలైన సంగతి తెలిసిందే. ఈ సారి బీజేపీ కి 400 స్థానాలకు పైగా వస్తాయని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే 10 సంవత్సరాల ఎన్డీఏ పాలనకు ప్రజలు చరమగీతం పాడబోతున్నారని, ఇండియా కూటమికి పట్టం కట్టబోతున్నారని కాంగ్రెస్ సహా కూటమిలోని పార్టీలు ధీమాగా ఉన్నాయి. కానీ, ఎన్డీఏ కూటమితో పోలిస్తే ఇండియా కూటమి కాస్త వెనుకబడింది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కూటమి నుంచి మమతా బెనర్జీ వైదొలగడం, నితీష్ వెళ్లి బీజేపీతో చేరడం, కేజ్రీవాల్ అరెస్టు వంటి పరిణామాలు ఇండియా కూటమితో పాటు కాంగ్రెస్ పార్టీని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి గెలవాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి ధైర్యం ఇచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
ఇండియా టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేవంత్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయో జోస్యం చెప్పారు. ఇస్ బార్ 400 పార్ అన్న నినాదం చెప్పడానికి బాగానే ఉంటుందని, కానీ, గత ఎన్నికల్లో ఎన్గీఏ కూటమికి 303 సీట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు.
అది కూడా గుజరాత్ లో 28కి 28 గెలిచారని, రాజస్థాన్లో 25కు 25, హర్యానాలో పదికి పది గెలిచారని, ఢిల్లీలో ఏడు సీట్లకు ఏడు గెలిచారని ఉత్తరప్రదేశ్ లో కూడా 60కి పైగా సీట్లు వచ్చాయని, బీహార్ లో ఒకటి రెండు మినహా మిగతా సీట్లు గెలిచారని, కర్ణాటకలో 28కి గాను 27 గెలిచారని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో 95 నుంచి 100% సీట్లు గెలుచుకున్నారని చెప్పారు.
అవన్నీ గెలిచిన తర్వాత వారు 303 సీట్లు చేరుకున్నారని గుర్తు చేశారు. కానీ, ఈ సారి పరిస్థితి బీజేపీకి అనుకూలంగా లేదని, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు రావాలంటే వారు పాకిస్థాన్ లో కూడా పోటీ చేసి గెలవాలని సెటైర్లు వేశారు రేవంత్. అయితే ఉపన్యాసం కోసం తాను ఇలా చెప్పడం లేదని, ఈసారి ఎన్నికల్లో రాజస్థాన్లో, ఢిల్లీలో, హర్యానాలో, గుజరాత్ లో, ఉత్తర్ ప్రదేశ్లో, బీహార్ లో గత ఎన్నికల్లో గెలిచినన్ని సీట్లు ఈసారి బిజెపి గెలుచుకోవడం అసాధ్యమని అన్నారు.
ప్రత్యేకించి దక్షిణాదిలో 129 సీట్లు ఉన్నాయని, ఇక్కడ బీజేపీకి ఎదురుగాలి బలంగా వీస్తోందని, తెలంగాణలో గత ఎన్నికల్లో 4 సీట్లు గెలిచిన బీజేపీకి ఈసారి 2 సీట్లు కూడా రావని అన్నారు. ఇలా అన్నీ కలుపుకుంటే 400 సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి అని రేవంత్ ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ 214 నుంచి 240 సీట్లు మధ్యలో బీజేపీకి వస్తాయని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు.
అంతకుమించి ఒక్క సీటు కూడా రాదని అన్నారు. ఈ టీవీ ఇంటర్వ్యూలో రేవంత్ చేసిన వ్యాఖ్యలతో నార్త్ ప్రజలకు కూడా రేవంత్ టాలెంట్ అర్థమైంది. ఇప్పటికే రాహుల్ గాంధీ అమితంగా ఇష్టపడే వారిలో రేవంత్ ప్రథముడు. ఒక్క ఇంటర్యూతో బీజేపీకీ పంక్చర్ చేసి కాంగ్రెస్ కి ఊపిరి పోశారు రేవంత్ అని సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
బీజేపీ గాలి తీసిన రేవంతన్న#TelanganaCM pic.twitter.com/sRpjdv95dO
— Aapanna Hastham (@AapannaHastham) April 15, 2024