సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 14 కీలక అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు. ఢిల్లీలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ మేనిఫెస్టోపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. “సంకల్ప పత్ర“ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను పేర్కొన్నారు. ప్రధానంగా వచ్చే ఐదేళ్ల పాటు పేదలకు ఉచితంగా రేషన్ అందించనున్నారు. తద్వారా ఆకలి చావులను అరికట్టాలనేది బీజేపీ లక్ష్యంగా పేర్కొన్నారు.
రోగులకు అవసరమైన అన్ని మందులను తక్కువ ధరలకు అందించే జన ఔషధి కేంద్రాలను రెట్టింపు చేయనున్నట్టు ప్రధాని తెలిపారు. మోడీ గ్యారెంటీగా.. పేదలకుప్రధాని ఆవాస్ యోజన పేరుతో వచ్చే ఐదేళ్లలో 3 కోట్ల ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్టు తెలిపారు. అదేవిధంగా వంట గ్యాస్ సిలిండర్ల స్థానంలో పైపులైన్ గ్యాసును వచ్చే ఐదేళ్ల దేశంలోని సగం ఇళ్లకు అందించనున్నట్టు ప్రధాని పేర్కొన్నారు. అదేవిధంగా విద్యుత్ బిల్లులను మూడో వంతు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు.
`సూర్య ఘర్` యోజన పేరుతో దేశవ్యాప్తంగా సోలార్ విద్యుత్ ను పెంచనున్నట్టు ప్రధాని తెలిపారు. అదేవిధంగా విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచనున్నట్టు మోడీ వివరించారు. “ముద్ర“ యోజన కింద.. స్టార్టప్లకు ఊతమిస్తామని తెలిపారు. తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ పథకం కింద 10 లక్షల కోట్ల రూపాయల రుణాలను అందిస్తామని తెలిపారు. దీంతో దేశంలో పారిశ్రామిక రంగం మరింత విస్తరిస్తుందన్నారు.
వీధి వ్యాపారులను ప్రోత్సహించేందుకు ఇప్పటికే అమలు చేస్తున్న `స్వనిధి` యోజన కింద.. వారికి బ్యాంకుల నుంచి పొందే రుణాలను రెండు రకాలుగా విస్తరిస్తున్నట్టు తెలిపారు. 50 వేల రూపాయల వరకు ఉన్న రుణాలను పెంచనున్నారు. రెండోది.. దీనిని మరిన్ని రంగాలకు విస్తరించనున్నట్టు తెలిపారు. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా దివ్యాంగులకు అనేక పథకాలు ప్రవేశ పెట్టామన్న ప్రధాని.. వీరికి కూడా పీఎం ఆవాస్ యోజన కింద ఇళ్లను ఇస్తామన్నారు.
ట్రాన్స్ జండర్లకు ఆయుష్మాన్ భారత్ పథకంలో లబ్ధి చేకూరుస్తామని మోడీ వెల్లడించారు. మహిళలకు ప్రత్యేకంగా వచ్చే ఐదేళ్లలో నారీశక్తిని మరింత పెంచేందుకు.. ఐటీ శిక్షణ, వైద్య శిక్షణ, పర్యాటకరంగంలో వీరికి శిక్షణ ఇవ్వడం ద్వారా.. ఉపాధి కల్పించనున్నట్టు తెలిపారు. మహిళలను స్వయంసమృద్ది కల్పించనున్నామన్నారు. నమో డ్రోన్ ద్వారా గ్రామాల్లో మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు.