పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత స్వల్ప అస్వస్థతకు గురికావడంతో ప్రచారానికి నాలుగు రోజుల పాటు విరామం ప్రకటించారు. ఈ రోజు జనసేనలో మండలి బుద్ధ ప్రసాద్, నిమ్మక జయకృష్ణ చేరిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పగిలే కొద్ది పదునెక్కేది గ్లాస్ అని…. గ్లాస్ గుర్తుకు ఓటెయ్యాలని పవన్ పిలుపునిచ్చారు. వైసీపీ ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ..గాలి తక్కువ అని, అది ఓడిపోయే పార్టీ అని ఎద్దేవా చేశారు. జనసేనను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తనను, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతానని ప్రజలకు పవన్ హామీ ఇచ్చారు. త్వరలోనే పిఠాపురంలోని 54 గ్రామాలలో ఏదో ఒక గ్రామంలో ఇల్లు తీసుకుంటానని అన్నారు. ఇక, జనసేనలో చేరిన మండలి బుద్ధ ప్రసాద్, నిమ్మక జయకృష్ణ పలువురు న్యాయవాదులు, మేధావులు విభిన్న వర్గాల ప్రజలకు స్వాగతం పలుకుతున్నానని పవన్ అన్నారు.
పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే. 19 అసెంబ్లీ స్థానాలకు, 2 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ప్రకటించారు. అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ఇంకా పవన్ ప్రకటించలేదు. అవనిగడ్డకు చెందిన టీడీపీ మాజీ నేత , మాజీ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్, పాలకొండకు చెందిన టీడీపీ మాజీ నేత నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరడంతో ఆ రెండు స్థానాలు భర్తీ అయినట్లుగా కనిపిస్తోంది.
అవనిగడ్డకు చెందిన టిడిపి సీనియర్ నేత బుద్ధ ప్రసాద్ అక్కడి నుంచి పోటీ చేయాలని భావించగా ఆ స్థానం జనసేనకు వెళ్ళింది . దీంతో, ఆయన టీడీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. అదేవిధంగా పాలకొండ టిడిపికి చెందిన కీలక నేత నిమ్మక జయకృష్ణ పార్టీకి రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు.దీంతో ఈ రెండు స్థానాలలో ఈ ఇద్దరు అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.