షాకింగ్ అంశం బయటకు వచ్చింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కరోనా కలకలం చోటు చేసుకుంది. అనూహ్యంగా భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరి తర్వాత ఒకరి చొప్పున సుప్రీంకోర్టు సిబ్బందిలో పలువురికి పాజిటివ్ నమోదైన వైనం షాకింగ్ గా మారింది. ఒక అంచనా ప్రకారం సుప్రీంకోర్టులోని 50 శాతం సిబ్బంది కరోనా బారిన పడినట్లుగా తేల్చారు.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులోని కేసుల విచారణ ఇకపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టాలని న్యాయమూర్తులు నిర్ణయించారు. పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు బయటకు రావటం ఇప్పుడు పలువురిలో ఆందోళన వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్ని భారీస్థాయిలో శానిటైజ్ చేయాలని నిర్ణయించారు.కోర్టులోని అన్ని బెంచీలు గంట ఆలస్యంగా విచారణ మొదలు కానున్నాయి.
తాజాగా దేశంలో కరోనా రెండో దశ తీవ్రంగా ఉంది. గడిచిన వారంలో పది లక్షల కేసులు నమోదయ్యాయి. ఆదివారం 1.50లక్షలకేసులు నమోదైతే.. ఈ రోజున 1.69లక్షల కేసులు నమోదైనట్లుగా వెల్లడైంది. రోజువారీ కేసుల్లో భారత్ లోనే అత్యధికకేసులు నమోదు కావటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి.