ఏపీలో జర్నలిస్టుల కు విలువ లేకుండా పోయిందని ప్రజాసంఘాలు పేర్కొంటున్నాయి. ప్రతి ఎన్నికల సమయంలో… రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం ఊరించటం.. ఆ తరువాత ఓడిపోవటం… జర్నలిస్తుల కథ కంచికి చేరటం.. తలిసిందే. ఇటీవల జగన్ ప్రభుత్వం కూడాఅదే స్లోగన్ ఇచ్చింది. ఇంకేముంది.. తాము ఇళ్లు ఇచ్చేస్తున్నామని.. దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చింది. తీరా అప్లయ్ చేసుకున్నాక.. ఇప్పుడు ఆ దరఖాస్తుల పరిస్థితి చెత్తకుప్పకు చేరింది.
కృష్ణా జిల్లాలో జర్నలిస్టుల ఇళ్ల కు చెందిన అతి కీలక ఫైల్ ఎలా చెత్త బుట్టను చేరింది. అక్రిడెషన్ కమిటీ సమావేశం తీర్మానం కాపీలో… ఇంచార్జి మంత్రి రోజా.. జిల్లాలోని ఆర్డీఓ లు.. జిల్లా రెవెన్యూ అధికారి.. ముగ్గురు పాత్రికేయ సభ్యులు సంతకాలు చేసిన పేజీని చెత్తబుట్టలో పడేశారు. ఇళ్ల స్థలాలు ఇస్తామని 40 పేర్లతో జాబితాను కూడా బుట్ట దాఖలా చేశారు. ఎలక్షన్ కోడ్ అమలు జరుగుతోంది. జూన్ 4 వరకు ఈ ఫైల్ తో పని లేదు. ఆ తరువాత వచ్చే ప్రభుత్వం మళ్ళీ ఇదేళ్లకు గొంతు సవరిస్తుంది.
కానీ, డీపీఆర్ఓ సిబ్బంది… ఇలా ఎందుకు చేశారనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మచిలీపట్నంలో జర్నలిస్టులకు నివేశన స్థలాలను మంజూరు చేస్తూ సాక్షాత్తు జిల్లా ఇంచార్జ్ మంత్రి రోజా సంతకం చేసిన తీర్మానం కాపీ చెత్త కుప్పలో దర్శనం ఇవ్వడంతో జర్నలిస్టులంతా విస్తుపోయారు. మచిలీపట్నంలో 40 మంది జర్నలిస్టులు నివేశన స్థలాలకు అర్హులని ఇటీవల జిల్లా కమిటీ తీర్మానం చేసింది.
ఎంతో గోప్యంగా ఉండాల్సిన కమిటీ తీర్మాన ప్రతులు చెత్త కుప్పలో దర్శనమివ్వడంతో జర్నలిస్టులంతా నిర్ఘాంతపోయారు. అయితే.. ఈ ఘటనపై వెంటనే స్పందించి ఈ విషయం పై జాయింట్ కలెక్టర్ ను విచారణ చేయమని కలెక్టర్ ఆదేశించారు. విచారణ లో బాద్యులను గుర్తించి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కానీ, ఇది జగన్ ప్రభుత్వానికి మచ్చగా మారిందని అంటున్నారు పరిశీలకులు.