వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్సభలో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ-జనసేన-బీజేపీలు సీట్లు పంచుకున్న విష యం తెలిసిందే. ఇక, అబ్యర్థుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇంతలోనే ప్రధాని నరేంద్ర మోడీతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని మూడు పార్టీలూ ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈ క్రమంలో చిలకలూరి పేట శివారులోని బొప్పూడిలో దాదాపు 40 ఎకరాల స్థలంలో ఈ సభను నిర్వహించనున్నారు. భారీ ఎత్తున జన సమీకరణ కూడా చేయాలని నిర్ణయించారు. అయితే.. సాధారణంగా ఇటీవల కాలంలో చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు పేర్లు పెడుతున్నారు.
కొన్నాళ్ల కిందట.. ఏలూరులో నిర్వహించిన సభకు “తెలుగు జన విజయ కేతన జెండా“ అని పేరు పెట్టారు. అంతకు ముందు నిర్వహించిన సభకు `నవశకం.. యువగళం` అని పేరు పెట్టారు. తాజాగా ఈ నెల 17న చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి నిర్వహిస్తున్న ఈ సభకు `ప్రజాగళం` అని పేరు పెట్టారు. అంతేకాదు, ఈ సభ కోసం ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కలిసి ఉన్న ఒక థీమ్ ఫొటోను కూడా డిజైన్ చేశారు. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. దాదాపు 2014 ఎన్నికల తర్వాత.. 2015లో జరిగిన అమరావతి శంకు స్థాపన తర్వాత.. మోడీ, చంద్రబాబులు పాల్గొనే సభ ఇదే కావడం గమనార్హం.
దీంతో ప్రధాని మోడీ, చంద్రబాబుకు కూడా ఈ సభ అత్యంత ప్రాధాన్యంగా మారింది. ఈ ఉమ్మడి సభకు ‘ప్రజాగళం’ అనే పేరు ఖరారు చేశారు. ఈ మేరకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రధాని మోదీ పాల్గొంటున్న సభను మూడు పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ‘ప్రజాగళం’ సభలో ఒకే వేదికపై ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేయి చేయి కలిపి కూటమి శక్తిని చాటే ప్రయత్నం చేయనున్నారు. అయితే.. ప్రధాని రాక సరే.. కానీ,ఏపీకి ఏమిస్తారు? అనేది ఆసక్తిగా మారింది. సభపై జగన్ను విమర్శిస్తారా? లేక.. అసలు ఆ ఊసే ఎత్తకుండా వెళ్లిపోతారా? అనేది చూడాలి.