టీడీపీ-జనసేన పొత్తు నేపథ్యంలో ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన తర్వాత కొందరు టీడీపీ, కొందరు జనసేన నేతలు కాస్త అసంతృప్తికి లోనైన సంగతి తెలిసిందే. టికెట్ ఆశించిన కొందరు నేతలకు నిరాశ ఎదురు కావడంతో కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. కొన్ని చోట్ల జనసేన జెండా లను, మరికొన్ని చోట్ల టీడీపీ జెండాలను కొందరు కార్యకర్తలు అవమానించారు. ఇరు పార్టీల జెండాలు మార్చుకొని ఒకరికొకరు సహకరించుకోవాల్సిన కార్యకర్తలు…జెండాలను అవమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ జెండా ప్రాముఖ్యతను…ఇరు పార్టీల శ్రేణులు ఒక పార్టీ జెండా మరొకరు మోయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ తాడేపల్లిగూడెంలో ఇరు పార్టీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘జెండా’ బహిరంగ సభకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ క్రమంలోనే ‘జెండా’ సభలో జనసేన జెండాను చంద్రబాబు, టీడీపీ జెండాను పవన్ కల్యాణ్ ఊపి ఇరు పార్టీల శ్రేణులకు పొత్తు ధర్మం అంటే ఏమిటో చెప్పకనే చెప్పారు. పరస్పరం జెండాలు మార్చుకుని ఇరు పార్టీల మధ్య ఉండాల్సిన స్నేహబంధాన్ని సింబాలిక్ గా ప్రదర్శించారు. చేయి చేయి కలిపి పైకెత్తి టీడీపీ, జనసేన నేతలు వేదికపై ఐక్యతను చాటారు. సభా వేదికపైకి కలిసి వచ్చిన చంద్రబాబు, పవన్ లు రైతన్నలకు మద్దతుగా నాగళ్లు భుజాన వేసుకున్నారు. అంతేకాదు, ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.