‘‘కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారిని 35 ఏళ్లుగా గెలిపిస్తూ వస్తున్నారు. అయితే, ఈసారి ఎన్నికల్లో మార్పు కోసం నేను కుప్పం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను. చంద్రబాబు గారికి కాస్త రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను…’’ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ఇవి. అవును, నిజమే..అవి ఆవిడ చేసిన కామెంట్లే. కానీ, ఆ కామెంట్లకు ముందు..ఆ కామెంట్లకు తర్వాత ఆమె ఏమన్నారో తెలుసుకుంటేనేగానీ విషయంపై పూర్తి క్లారిటీ రాదు.
కుప్పంలో జరిగిన ‘నిజం గెలవాలి’ సభలో భువనేశ్వరి చేసిన ఈ వ్యాఖ్యలను వైసీపీ సోషల్ మీడియా అఫీషియల్ ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసి వైరల్ చేశారు. చంద్రబాబును రెస్ట్ తీసుకోమని స్వయంగా ఆయన సతీమణి భువనేశ్వరి చెబుతున్నారని, కాబట్టి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయకుండా ఆయన స్థానంలో తాను పోటీ చేస్తానని భువనేశ్వరి చెబుతున్నారని ట్వీట్ చేశారు. చంద్రబాబును రాజకీయాల నుంచి ఆయన భార్య భువనేశ్వరే తప్పుకోమంటున్నారని, ఆమె చెప్పినట్లుగా చంద్రబాబు రెస్ట్ తీసుకునే సమయం ఆసన్నమైందని ఆ పోస్ట్ సారాంశం.
ఇంకేముంది, క్షణాల్లోనే ఈ పోస్ట్ వైసీపీ సోషల్ మీడియా వర్గాల్లో వైరల్ గా మారింది. వాస్తవానికి ఆ మాటలు ఎడిట్ చేసినవి కాదు స్వయంగా నారా భువనేశ్వరి అన్నవే. అయితే, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. నారా భువనేశ్వరి ఆ వ్యాఖ్యలను సీరియస్ గా చేయలేదు. తాను ఇప్పుడు ఒక జోక్ చెప్పబోతున్నానని, కేవలం సరదాగానే తాను మాట్లాడుతున్నాను అని చెప్పి మరీ ఆ వ్యాఖ్యలను మొదలుబెట్టారు.
అయితే, వైసీపీ సోషల్ మీడియాతో పాటు వైసీపీ అభిమానులు మాత్రం తమకు కావలసిన 26 సెకండ్ల నిడివి ఉన్న వీడియోను మాత్రమే సర్క్యులేట్ చేస్తున్నారు. కానీ, భువనేశ్వరి అన్న మాటల పూర్తి నిడివి ఒక నిమిషం 35 సెకండ్లు ఉన్న వీడియోను చూస్తే గాని అసలు విషయం అర్థం కాదు.
తాను ఎప్పుడూ కొంచెం సీరియస్ గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తోందని, అందుకే సరదాగా జోక్ చేసేందుకు ఒక విషయం అడుగుతాను అంటూ సభలో టీడీపీ కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి భువనేశ్వరి సంభాషించారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారికి రెస్ట్ ఇచ్చి కుప్పంలో తాను పోటీ చేస్తే మీలో చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చే వారు ఎవరు నాకు మద్దతు ఇచ్చే వారు ఎవరు చేతులెత్తండి అంటూ భువనేశ్వరి నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు ఆ సభలో నవ్వులు పూయించాయి.
అయితే సభలో ఉన్న వారంతా చంద్రబాబు కావాలని…భువనేశ్వరి కావాలని చేతులెత్తారు. అలా కుదరదని ఎవరో ఒకరు కావాలని మాత్రమే చేతులెత్తాలని భువనేశ్వరి సరదాగా మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఈ సరదా వ్యాఖ్యలు అయిపోయిన తర్వాత భువనేశ్వరి సీరియస్ గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హెరిటేజ్ వ్యాపారాలతో తాను బిజీగా ఉన్నానని, చంద్రబాబు గారు తనను బాగా చూసుకుంటున్నారని భువనేశ్వరి చెప్పారు. తనకు ఏ పదవుల మీద ఆశ లేదని, ఈ వ్యాఖ్యలు కేవలం సరదాగా మాత్రమే చేశానని మళ్లీ మళ్లీ చెప్పారు.
అయినా సరే ఆ వ్యాఖ్యలు పట్టించుకోని వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ భువనేశ్వరి సరదాగా లైటర్ వీన్ లో చేసిన వ్యాఖ్యలను వైరల్ చేశాయి. దీంతో పూర్తి వీడియో పెడుతూ వైసీపీ సోషల్ మీడియా విభాగానికి టీడీపీ సోషల్ మీడియా విభాగం, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు దీటుగా కౌంటర్లు ఇస్తున్నారు. ఇటువంటి వీడియోలు వైరల్ చేయడం వైసీపీకి అలవాటేనని దుయ్యబడుతున్నారు.
భువనేశ్వరి గారు చెప్పింది ఏంటి, ఈ సైకో ఫేక్ చేసింది ఏంటో చూడండి. ఇలా తృప్తి పడుతూ, శునకానందం పొందే బ్రతుకులూ బ్రతుకేనా? #YCPFakeBrathuku #2024JaganNoMore #AndhraPradesh https://t.co/KUia0tDLlC pic.twitter.com/w6j07mpp3n
— Telugu Desam Party (@JaiTDP) February 21, 2024