ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు భారీ స్థాయిలో హామీలు గుప్పించడం మామూలే. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల రణరంగానికి ఇంకో రెండు నెలలే సమయం ఉండగా.. తెలుగుదేశం పార్టీ చాలా ముందుగానే ఆరు గ్యారెంటీల పేరుతో కొన్ని ఆకర్షణీయ హామీలు ఇచ్చింది. వీటికి దీటుగా అధికార పార్టీ కొత్త హామీలు ప్రకటిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఐతే సిద్ధం పేరుతో ఇప్పటికే మూడు భారీ సభలు నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీల జోలికి వెళ్లలేదు. సిద్ధం సభల్లో చివరి వేదిక అయిన రాప్తాడులో జగన్ మేనిఫెస్టోను ప్రకటిస్తాడని.. అందులో రుణ మాఫీ హామీని ప్రకటిస్తాడని మీడియాకు ముందు రోజు లీకులు కూడా ఇచ్చారు. వైసీపీ సోషల్ మీడియా జనాలు ఈ విషయాన్ని గట్టిగా ప్రచారం కూడా చేశారు. లక్ష లోపు రుణాలకు మాఫీ వర్తించేలా ప్రకటన ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ తీరా చూస్తే జగన్ నోట రుణమాఫీ ప్రకటన రాలేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ప్రకారం రుణమాఫీ అనేది అసాధ్యమైన హామీ అనే చెప్పాలి. జీతాలకే డబ్బులు లేక, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు కరువై అల్లాడిపోతోంది రాష్ట్ర ప్రభుత్వం. అలాంటిది రుణమాఫీ హామీ అంటే మోయలేని భారం అవుతుంది. అందుకే ప్రతిపక్ష తెలుగుదేశం కూడా దాని జోలికి వెళ్లట్లేదు. 2014లో చంద్రబాబు రుణమాఫీ హామీ ఇచ్చారు కానీ.. ఎన్నికల అనంతరం విడతల వారీగా అమలు చేయడం జనానికి నచ్చలేదు. దాని మీద వైసీపీ టీడీపీని తూర్పారబట్టింది.
ఇటీవలే విడుదలైన ‘యాత్ర’ సినిమాలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. రుణమాఫీ హామీ ఇస్తే గెలిచే అవకాశమున్నా సరే అది అమలు చేయలేని హామీ కాబట్టే జగన్ వెనక్కి తగ్గినట్లు చూపించారు. అలాంటిది ఇప్పుడు జగన్ కనుక రుణమాఫీ హామీని ప్రకటిస్తే.. సినిమాలో చూపించిన విషయాన్ని పట్టుకుని ఆయన్ని ట్రోల్ చేసే అవకాశముంది. టీడీపీ, జనసేన సోషల్ మీడియా టీమ్స్ ఈ అంశాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టవు.
ఇప్పటికే మద్య నిషేధం, సీపీఎస్ రద్దు సహా జగన్ మడమ తిప్పిన అనేక హామీల మీద నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. రుణమాఫీ హామీని ప్రకటిస్తే పాత హామీలు గుర్తు చేసి దీని మీద విమర్శలు గుప్పించే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే జగన్ వెనక్కి తగ్గారా లేక.. ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టి తర్వాత ఈ హామీని ప్రకటిస్తారా అన్నది చూడాలి.