తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్ వ్యవహారం ఇపుడు ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర అతడి ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కంటెస్టెంట్ల ఆర్టీసీ బస్సులను, వాహనాలను ప్రశాంత్ అభిమానులు ధ్వంసం చేశారు. దీంతో, ఆ కేసులో పల్లవి ప్రశాంత్ ను ప్రధాన నిందితుడిగా, ఆయన అభిమానులను సహ నిందితులుగా చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు, బిగ్‌బాస్ షో నిర్వాహకులు హెచ్చరిస్తున్నా వినకుండా ప్రశాంత్ స్టూడియో బయటకు రావడంతోనే వాహనాల ధ్వంసం జరిగినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఏ1 నిందితుడు కాగా, అతడి సోదరుడు మనోహర్‌ను ఏ2గా, వారి స్నేహితుడు వినయ్‌ను ఏ3గా చేర్చారు. ఏ4 నిందితుడు శంతని సాయికిరణ్ (25), ఏ5 నిందితుడు అంకిరావుపల్లి రాజు (23)ను అరెస్ట్ చేశారు.
అయితే, ప్రధాన నిందితుడు పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తన సొంతూరు గజ్వేల్ సమీపంలోని కొల్గూరుకు ప్రశాంత్ వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ తన మొబైల్‌ను స్విచ్చాఫ్ చేసుకుని వేరే ప్రాంతానికి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కాగా, పల్లవి ప్రశాంంత్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. బిగ్ బాస్ గెలిచిన తర్వాత రైతుబిడ్డ ప్రశాంత్ అసలు స్వరూపం బయటపడిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పోలీసులు వెళ్లమని వారిస్తున్నా వినకుండా ప్రశాంత్ చేసిన రచ్చ వల్లే ఇంత గందరగోళ పరిస్థితులు వచ్చాయని విమర్శిస్తున్నారు.