టీడీపీ-జనసేన పొత్తుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని, ఏపీ అభివృద్ధి కోసం జనసేన-టీడీపీ పొత్తును బలపరిచి గెలిపించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. టీడీపీ-జనసేన పొత్తు కనీసం పదేళ్లపాటైన కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందని, అందుకే, 2024 ఎన్నికల్లో జనసేన-టీడీపీ కూటమిని గెలిపించి వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేయాలని ప్రజలకు పవన్ పిలుపునిచ్చారు.
విభజన ద్వారా రాష్ట్రం ఎంతో నష్టపోయిందని, రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాట పట్టాలంటే కచ్చితంగా టీడీపీ-జనసేన కూటమిని గెలిపించాలని పవన్ అన్నారు. జనసేన ఉన్నందున ముస్లింలు తమకు దూరం అవుతున్నారన్న ప్రచారంపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లింలను ఎప్పటికీ ఓటు బ్యాంకులా చూడబోమని పవన్ చెప్పారు. ముస్లింలకు ఏదైనా సమస్య వస్తే వారివైపే తాను నిలబడతానని, వారి అవసరాలకు అనుగుణంగా పార్టీ విధివిధానాలుంటాయని పవన్ క్లారిటీనిచ్చారు. జనసేనకు ఒక అవకాశం ఇవ్వాలని ముస్లింలకు కూడా పవన్ విజ్ఞప్తి చేశారు. ముస్లింల తరఫున గళం ఎత్తే నాయకుడిని తాను అవుతానంటూ పవన్ హామీ ఇచ్చారు. ఈ ఒక్కసారికి జనసేనను నమ్మాలని, తమకు ఓటేయాలని పవన్ రిక్వెస్ట్ చేశారు. తాను మాటిస్తే వెనక్కి వెళ్ళబోనని, వారికి అండగా ఉంటానని భరోసానిచ్చారు.
మరోవైపు, మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, టాలీవుడ్ నిర్మాత బన్నీ వాస్ ను జనసేన పార్టీ ప్రచార విభాగం చైర్మన్ గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో బన్నీ వాస్ కు సంబంధిత నియామక పత్రాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా అందించారు. ప్రచార విభాగం పార్టీకి ఎంతో కీలకమని, పార్టీ గెలుపు కోసం వినూత్న కార్యక్రమాలు, ప్రచారం చేపట్టాలని, పార్టీ ఎదుగుదలకు కష్టపడాలని పవన్ చెప్పారు.