ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగులు కదం తొక్కుతున్న విషయం తెలిసిందే. తమకురావాల్సిన జీతాలను 1న కూడా ఇవ్వడం లేదని, ఇక, డీఏ బకాయిలు ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు సీపీఎస్ రద్దు చేస్తామన్న జగన్ .. ఇప్పటి వరకు దానిని రద్దు చేయకపోగా.. జీపీఎస్ తెచ్చారని మండిపడుతున్నారు. దీంతో ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. దీనిని గమనించిన పెన్షనర్లు.. ఇప్పుడు రోడ్డెక్కారు. తమకు కూడా.. పింఛన్లు సకాలంలో ఇవ్వడం లేదని, తమకు రావాల్సిన ఆర్ ఏ బకాయిలను వాయిదా వేస్తున్నారని.. దీంతో వృద్ధాప్యంలో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.
ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటు బ్యాంకును(ముఖ్యంగా ఉద్యోగుల) చీల్చేందుకురెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా “పెన్షనర్స్ పార్టీ“ పేరుతో కొత్త రాజకీయపార్టీని ప్రకటించారు. దీనిని మాజీ ఐఏఎస్ అధికారి, ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అత్యంత అగౌరవ రీతిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించబడిన అధికారి.. ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో దీనిని స్థాపించారు. ఈ సందర్భంగా ఎల్వీ మాట్లాడుతూ.. పెన్షనర్ల హక్కుల కోసం రాజకీయ పార్టీ పెట్టి పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు.
రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తులు సరైన వాళ్లు అయితే అందరి హక్కులకు రక్షణ ఉంటుందని ఎల్వీ చెప్పారు. వ్యవస్థలు సక్రమంగా నడిచినప్పుడు వ్యక్తుల స్వాతంత్ర్యం కాపాడబడుతుందన్నారు. పెన్షనర్ల హక్కులను ప్రస్తుత ప్రభుత్వం కాలరాస్తోందని, విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో రాజకీయ పార్టీ పెట్టి తమ హక్కుల కోసం పోరాడాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బరాయన్ అన్నారు. వైసీపీ అధినేత జగన్.. సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు.
సకాలంలో పెన్షన్లు అందక విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సుబ్బరాయన్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ హక్కుల కోసం పోరాడేందుకు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ ఏర్పాటు చేశామని, రాబోయే ఎన్నికల్లో అన్ని అర్బన్ ప్రాంతాల్లో `పెన్షనర్స్ పార్టీ` పోటీలో ఉంటుందన్నారు. పెన్షనర్ల హక్కుల కోసం, యువత భవిష్యత్తు కోసం తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశామని.. త్వరలోనే గుర్తింపు లభిస్తుందని.. గుర్తింపు లభించకపోయినా.. ఒంటరిగా(ఇండిపెండెంట్) అయినా..ఎన్నికల్లో పోటీ చేస్తామని వారు వెల్లడించారు.