తిరుపతి ఎన్నికల పోలింగ్ దగ్గరపడింది. దీంతో ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీల ప్రముఖ నేతలు తిరుపతిలో తిష్టవేశారు. చిత్తూరు, నెల్లూరు రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్న తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని పార్టీల నేతలు కలియతిరుగుతున్నారు. ఆయా పార్టీల అధినేతలు మాత్రం ఇంకా రంగంలోకి దిగలేదు.
ఇక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 8 నుంచి తిరుపతిలో ప్రచారం నిర్వహించనున్నారు. ఉప ఎన్నికలో టీడీపీ నుంచి నిలబడిన కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి తరఫున చంద్రబాబు ప్రచారం చేస్తారు. వారం రోజుల పాటు చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నారు.
రేపు రాత్రి చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి చేరుకుంటారు. 8న ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఎన్నికలప్రచారాన్ని ప్రారంభిస్తారు. మొత్తం వారం రోజుల పాటు రోజుకు ఒక శాసనసభ నియోజకవర్గంలో ప్రచారం చేస్తారు. ఒక్కో నియోజకవర్గం పరిధిలో రెండు మూడు ప్రచార సభల్లో చంద్రబాబు పాల్గొంటారు.
ఇప్పటికే మూడు రోజుల క్రితం నుంచి రాష్ట్ర నేతలు లోకేష్, దేవినేని, చింతమనేని ప్రభాకర్ వంటి అనేక మంది నేతలు తిరుపతిలో ప్రచారం చేస్తున్నారు.