ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో 24 మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. అందులో విజయనగరం జిల్లాకు చెందిన రౌతు జగదీష్, గుంటూరు జిల్లాకు చెందిన జవాన్ మురళీకృష్ణ కూడా అమరులయ్యారు. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు అమరవీరుల మృతిపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు.
ఆ ఇద్దరు వీర జవాన్లకు ఏపీ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపడంతోపాటు ఒక్కో కుటుంబానికి రూ.30లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. ఆ ఆర్థిక సాయాన్ని తక్షణమే వారి కుటుంబాలకు అందజేయాలని, వారి కుటుంబసభ్యులకు బాసటగా నిలవాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ ఆర్థిక సాయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొద్ది నెలల క్రితం జమ్మూకశ్మీర్ లోని కుప్పారా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో చిత్తూరుకు చెందిన చీకల ప్రవీణ్ కుమార్ రెడ్డి వీర మరణం పొందారు. హవాల్దార్ గా పనిచేస్తూ కమాండో ట్రైనింగ్ తీసుకుంటున్న ప్రవీణ్ మృతికి సంతాపం ప్రకటించిన జగన్….ప్రవీణ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
ఆనాడు ప్రవీణ్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన జగన్…ఈనాడు జగదీష్, మురళీకృష్ణల కుటుంబాలకు రూ.30లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంకోసం పోరాడుతూ ఆ ముగ్గురూ అమరులయ్యారని, అటువంటపుడు వారికి ఇచ్చే ఆర్థికసాయంలో తేడా ఎందుకుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఏపీ సీఎంగా జగన్ రెడ్డి ఉన్నారు కాబట్టి సైనికుల త్యాగాల కన్నా కులాన్ని బట్టి ఆర్థిక సాయం మారుతుందా అని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఇప్పటికే ఏపీలో కులపోరుకు తెరతీసిన జగన్ రాజకీయాలను భ్రష్టుపట్టించారని, ఇపుడు జవాన్ల విషయంలోనూ కుల రాజకీయాలు చేసే స్థాయికి దిగజారారని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. మరి, ఈ విమర్శలపై ఏపీ సర్కార్ ఏవిధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.