సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని, ఏపీ ఆర్థిక వ్యవస్థ అంధకారంలో మునిగిపోయిందని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక, జగన్ చేసిన అప్పులకు లెక్కలు కూడా సరిగా చూపడం లేదంటూ కాగ్ వంటి సంస్థలు కూడా పలుమార్లు ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేశాయి. అయినా సరే, తీరు మారని జగన్ సర్కారు…సంపద సృష్టించాల్సింది పోయి అప్పుల కోసం ఢిల్లీలో కేంద్రం పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్న వైనంపై కూడా జనసేన, టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఏపీ అప్పులపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడుతోందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర కార్పొరేషన్లు, బెవరేజ్ కార్పొరేషన్లపై కేంద్ర విచారణ సంస్థతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రకారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు పురందేశ్వరి లేఖ సమర్పించారు. ఏపీ పర్యటనలో ఉన్న నిర్మల సీతారామన్ కు ఆమె ఈ లేఖను అందించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని పురందేశ్వరి కోరారు.
ఏపీ ప్రభుత్వం దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, ఆ అప్పుల వ్యవహారం ఇంకా అలాగే కొనసాగుతుందని ఆరోపించారు. ఆర్బిఐకు దాఖలు చేసిన 4.47 లక్షల కోట్ల గురించి మాత్రమే ఏపీ ప్రభుత్వం లెక్కలు చెబుతుందని, కార్పొరేషన్లతో సహా చేసిన ఇతర అప్పుల గురించి వెల్లడించడం లేదని ఆరోపించారు. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని సొంత మీడియా ద్వారా ప్రచారం చేసి బిజెపి పరువు తీస్తుందని ఆరోపించారు.
భవిష్యత్తులో తీర్చలేని స్థాయికి ఏపీ అప్పులు చేరుకున్నాయని ఆరోపించారు. అన్ని రకాల గ్యారంటీలను ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకురావాలని కోరారు. మరి, పురందేశ్వరి ఆరోపణల పై వైసీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.