సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన విమర్శలు చేశారు. సైకో జగన్ అనావృష్టికి అన్నయ్య అని సెటైర్లు వేశారు. సైకో జగన్ చూపు పడితే పచ్చని పంట పొలాలు కూడా ఎండిపోతాయని, జగన్ అడుగుపెడితే నిండుకుండలా ఉన్న డ్యాముల గేట్లు కొట్టుకుపోయి ఖాళీ అవుతాయని ఎద్దేవా చేశారు. కరువుకి బ్రాండ్ అంబాసిడర్, దరిద్రానికి కేరాఫ్ అడ్రస్ సైకో జగన్ అని చురకలంటించారు. గత వందేళ్లలో అతి తక్కువ వర్షపాతం నమోదై ఏపీలో కరువు విలయతాండవం చేస్తోందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటువంటి పరిస్థితుల్లో రైతులు సాగునీరు ప్రభూ అని గగ్గోలు పెడుతున్నా తాడేపల్లి కొంపలో నీరో చక్రవర్తి లాగా జగన్ ఇసుక, లిక్కర్ లెక్కలు వేసుకుంటూ ఫిడేల్ వాయిస్తున్నారని రాజకీయ కక్ష సాధింపులతో బిజీగా ఉన్నారని ఆరోపించారు జగన్కు ఒక్క ఛాన్స్ ఇచ్చిన కర్మానికి రైతులకు వరి తాడే దిక్కు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, విజయదశమి నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ల మధ్య సమావేశం జరగబోతున్న సంగతి తెలిసిందే. భవిష్యత్ కార్యాచరణపై ఈ ఇద్దరు నేతలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఈ భేటీకి ముందు జైల్లో టిడిపి అధినేత చంద్రబాబుతో లోకేష్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా జనసేనతో సమన్వయ కమిటీ సమావేశం తదితర అంశాలపై చంద్రబాబుకు లోకేష్ వివరించారు. దాంతోపాటు కరువు రైతుల సమస్యలు, కృష్ణాజలాల పునఃపంపిణీ వంటి సమస్యలపై కూడా చంద్రబాబుకు వివరించారు. ఇక, జైలు నుంచి చంద్రబాబు విడుదల చేసిన లేఖపై వైసీపీ రాజకీయం చేస్తోందని చంద్రబాబుకు లోకేష్ చెప్పినట్టుగా తెలుస్తోంది. నిత్యావసర ధరల పెంపు, విద్యుత్ చార్జీల పెంపు వంటి అంశాలపై ఫోకస్ చేయాలని, ప్రజల్లోకి వాటిని బలంగా తీసుకువెళ్లాలని లోకేష్ కు చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.