బుధవారం పెడనలో జనసేన బహిరంగ సభ సందర్భంగా రాళ్లు, కత్తులతో వైసీపీ మూకల దాడి జరిగే చాన్స్ ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ కార్యకర్తలు, జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని, అల్లరి మూకలను పట్టుకొని పోలీసులకు అప్పగించాలని పిలుపునిచ్చారు. పెడన సభలో ఏం జరిగినా జగన్, డిజిపి, హోంమంత్రిదే బాధ్యత అని పవన్ షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చిన వైనం సంచలనం రేపుతోంది. ఏ ఆధారాలతో ఆరోపణలు చేశారో వివరణ ఇవ్వాలంటూ పవన్ కు నోటీసులిచ్చారు.
అయితే, పోలీసుల నోటీసులకు పవన్ , జనసేన నేతలు రిప్లై ఇవ్వలేదు. దీంతో, పవన్ పై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ నోటీసులకు పవన్ సమాధానమివ్వలేదని, నిరాధార, బాధ్యతారహిత ఆరోపణలు చేస్తే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పవన్ సభ ప్రాంతాన్ని పరిశీలించామని, సరిపడా బందోబస్తు చేశామని అన్నారు. పవన్ పై దాడి జరగబోతోందని ఎలా తెలుసని ప్రశ్నించారు.
తమ నోటీసులకు జవాబు రాలేదు కాబట్టి పవన్ వి నిరాధారమైన ఆరోపణలు అనుకోవాలా అని ప్రశ్నించారు. పవన్ కన్నా బలమైన సమాచార వ్యవస్ధ పోలీసులకుందని, అనుమానాస్పద విషయాలేమీ తమ దృష్టికి రాలేదని తెలిపారు. రెచ్చగొట్టే భాష, సైగలు, లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగిస్తాయని చెప్పారు. ప్రముఖ వ్యక్తులు, పోలీసు శాఖ ఉన్నతాధికారుల మీద రాజకీయ పార్టీలు ఈ తరహా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.