టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు తర్వాత నారా భువనేశ్వరితోపాటు నారా బ్రాహ్మణి కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ పాలనపై బ్రాహ్మణి పదునైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి జగన్ సర్కార్ పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్యాన్ని వైసీపీ అపహాస్యం చేస్తోందని, ఆధారం లేకుండా అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో కీలకంగా మారిన సీమెన్స్ సంస్థ మాజీ ఎండీ సుమన్ బోస్ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. తమ సంస్థపై వస్తున్న అసత్య ఆరోపణల గురించి ఆయన క్లారిటీనిచ్చారు. దీంతో, సుమన్ మాట్లాడిన వీడియోను లోకేష్ తన X(ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసి జగన్ పై విమర్శలు గుప్పించారు.
“సీమెన్స్ అధ్వర్యంలో వందల మంది భాగస్వాములుగా చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చాలా విజయవంతమైంది. ఈ ప్రాజెక్టులో అవినీతి ఉంది అంటూ రెండున్నరేళ్లుగా ఒక్క ఆధారం లేకుండా అసత్య ప్రచారం చేస్తున్నారు. షెల్ కంపెనీ ముద్ర వేస్తున్నారు, అసలు వాటి అర్థం తెలుసా? తప్పుడు ఆరోపణలతో లక్షల కుటుంబాలను, శిక్షణ పొందిన విద్యార్థులను తీవ్రమైన క్షోభ పెడుతున్నారు” అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
తాజాగా లోకేష్ ట్వీట్ ను షేర్ చేస్తూ బ్రాహ్మణి…జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. “సిమెన్స్ మాజీ ఎండీ స్పష్టం చేశారు. వైసీపీకి గుణపాఠం చెప్పారు. పాలన, ప్రభుత్వ సంస్థలు, బహుళజాతి సంస్థలు, యువత, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకండి.మీరు పాలనలో అసమర్థులు మాత్రమే కాదు, సత్యాన్ని గ్రహించే విషయంలోనూ అసమర్థులే. #IAmWithBabu #letsSaveJobs” అని బ్రాహ్మణి చేసి ట్వీట్ వైరల్ గా మారింది.