ఔను.. రాజకీయ వర్గాల్లో ఇదే మాట వినిపిస్తోంది. వరుస పెట్టి 10 రోజుల పాటు ఇంటా బయటా కూడా ఏపీ అధికార పార్టీ వైసీపీకి వాచిపోయే పరిణామాలు ఎదురుకానున్నాయని చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం, జైల్లో పెట్టడం వంటి పరిణామాలను జాతీయస్థాయిలోకి తీసుకువెళ్లాలని టీడీపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోవైపు రాష్ట్రంలోనూ ఇప్పటికే టీడీపీ నాయకులు ప్రజాసంఘాలను కలుపుకొని ఉద్యమాలు చేస్తున్నారు.
ఇక, ఈ పరంపరలోనే ఈ నెల 18 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇవి అయ్యీ అవడంతోనే ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆరు నుంచి ఏడు రోజుల పాటు జరగనున్నాయి. అంటే.. అటు పార్లమెంటు, ఇటు ఏపీ అసెంబ్లీలను కలుపుకొంటే.. మొత్తంగా పది రోజులకు పైగానే చట్ట సభలు పనిచేయనున్నాయి. దీంతో టీడీపీ వ్యూహాత్మకంగా చంద్రబాబు అక్రమ అరెస్టు, స్కిల్ డెవలప్మెంట్ అంశాలను అటు పార్లమెంటులో గట్టిగా లేవనెత్తాలని ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించింది.
అంటే, పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో టీడీపీ సభ్యులు రాజ్యసభ, లోక్‌సభల్లో చంద్రబాబు అంశాన్ని ప్రధానంగా చర్చకు పెట్టి, వైసీపీ సర్కారు దమన నీతిని పార్లమెంటు వేదికగా ఎండగట్టనున్నారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ చెప్పుకొచ్చారు. ఇక, పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే ఇటు అసెంబ్లీలోనూ.. చంద్రబాబు విషయాన్ని టీడీపీ సభ్యులు భారీ ఎత్తున చర్చకు పట్టుబట్టడం ఖాయమని అంటున్నారు. అంటే, హైకోర్టులో చంద్రబాబు పిటిషన్లు విచారణకు వచ్చే లోగా(ఈ నెల 19న విచారణకు రానున్నాయి)నే పార్లమెంటులో ఈ విషయం చర్చకు వచ్చేయనుంది.
అదేవిధంగా హైకోర్టు తీర్పు, లేదా ఆదేశాలు ఎలా ఉన్నా.. అసెంబ్లీలో సర్కారు చర్యలను కడిగేయాలని టీడీపీ నాయకులు ప్రాథమికంగా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ఇలా.. మొత్తంగా అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీలో వైసీపీని నిలదీసేందుకు, ఆ పార్టీ అక్రమాలను ఎండగట్టేందుకు తెలుగుదేశం సభ్యులు అస్త్ర శస్త్రాలను రెడీ చేసుకోవడం.. చూస్తే.. రాజకీయంగా పది రోజుల పాటు వైసీపీ ఇరుకున పడడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.