టీడీపీ అధినేత చంద్రబాబు 2019లో జరిగిన ఎన్నికల తర్వాత అధికారం కోల్పొయి.. ప్రతిపక్షంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే… అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన `నాలుగు` అత్యంత కీలక పరిణామా లను ఎదుర్కొనాల్సి వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే.. చంద్రబాబుకు ఈ నాలుగు ఘటనలు కూడా షాకింగ్ పరిణామాలుగానే భావించాలి. వీటిని తక్కువ చేసి చూసే అవకాశం కూడా లేదు. సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత… తొలి రెండేళ్లు కరోనాతో పోయినా.. తర్వాత రెండున్నరేళ్ల కాలంలో ప్రతిపక్షమే లక్ష్యంగా సాగించిన `రాజకీయం` చంద్రబాబు జీవితంలో మరిచిపోలేని ఘటనలకు కీలకంగా మారింది.
1) తొలిసారి కన్నీరు: చంద్రబాబు సతీమణిపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ దుమారమే కాదు.. మానసికంగా చంద్రబాబును కుంగదీశాయనే చెప్పాలి. ఈ పరిణామాలను ఆయన సహించలేక పోయారు. అసెంబ్లీలోనే అవమాన కరంగా చేసిన వ్యాఖ్యలకు ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. వెక్కి వెక్కి ఏడ్చారు. ఇది చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయంలో ఎన్నడూ ఊహించని ఘటన.
2) ఇంటిపైనా, కేంద్ర కార్యాలయంపైనా దాడి: ఇది కూడా చంద్రబాబును తీవ్ర మనక్షోభకు గురి చేసిన అంశమే. ఉండవల్లిలోని ఆయన నివాసంపైకి ప్రస్తుత మంత్రి జోగి రమేష్ తన దండుతో దండయాత్రకు వెళ్లినప్పుడు చంద్రబాబు చివురుటాకుమాదిరిగా వణికిపోయిన దృశ్యాలు ఇప్పటికీ.. పార్టీ నాయకుల కళ్ల ముందు కదులుతూనే ఉన్నాయి. దీనిని మరిచిపోయేలోగానే పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌ను వైసీపీ మూకలు ధ్వంసం చేశాయి. ఈ రెండు ఘటనలు కూడా చంద్రబాబుకు తీరని వేదన మిగిల్చాయి.
3) రాళ్ల దాడులు, నిలువరింతలు: చంద్రబాబు అనేక సందర్భాల్లో వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల మధ్యకు వచ్చారు. ఇలా వచ్చిన ప్రతిసారీ ఆయనను నిలువరించే ప్రయత్నాలు జరిగాయి. నందిగామ, గుంటూరు ప్రాంతంలో చంద్రబాబుపై రాళ్లు విసిరారు. అయితే, అదృష్టవశాత్తు ఆయన కు తగలలేదు. ఇక, విశాఖలో ఆయనను పర్యటించకుండాపోలీసులు అడ్డుకున్న ఘటన కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో నడిరోడ్డుపై చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు.
4) అరెస్టు, జైలు: తాజాగా జరిగిన ఉదంతంలో చంద్రబాబు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. రిమాండ్ ఖైదీగానే అయినప్పటికీ.. చంద్రబాబు జీవితంలో ఎన్నడూ ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించకపోవడం గమనార్హం. ఇక, అసెంబ్లీలో ప్రతిజ్ఞ, సభ బహిష్కరణ వంటివి కూడా చంద్రబాబు రాజకీయ జీవితంలో చెరగని గుర్తులుగా నే మిగిలిపోయాయి.