షెల్ కంపెనీల ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు 118 కోట్ల రూపాయల ముడుపులు అందాయని, ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం పలు ఆంగ్ల పత్రికలలో ప్రచురితమైందని, అయినా ఈ వ్యవహారంపై చంద్రబాబు స్పందించడం లేదని వైసీపీ నేతలు సజ్జల, విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై చంద్రబాబు తొలిసారిగా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఒకటే చెప్తున్నా…ఎన్నిసార్లు ఎంక్వయిరీ వేసిన ఏం పీకలేకపోయారు, టీడీపీ నిప్పులాంటి పార్టీ’’ అని చంద్రబాబు షాకింగ్ కామెంట్లు చేశారు.
ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఇష్టానుసారంగా మాట్లాడి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే సమాధానం చెప్పాల్సిన అవసరం ఎవరికీ లేదని చంద్రబాబు …వైసీపీ నేతలకు పరోక్షంగా దీటైన జవాబిచ్చారు. నీతి నిజాయితీగా ఉన్న పార్టీ టిడిపి అని, ప్రజల కోసం ఒక పద్ధతిగా పనిచేసిన పార్టీ తమదని అన్నారు. వైసీపీ ప్రజల రక్తం తాగే దోపిడీ దొంగల పార్టీ అని విమర్శించారు. వీరందరూ గజదొంగల కన్నా ఎక్కువేనని, అవినీతి అనకొండల కన్నా దారుణమని చంద్రబాబు విమర్శించారు. దొరికితే అన్నీ మింగేసే తిమింగలాలు కూడా వీరి ముందు సరిపోవని ఎద్దేవా చేశారు. అంతకన్నా పెద్ద దుర్మార్గులని విమర్శించారు.
గత 40 ఏళ్లలో ఏనాడు చూడని విధంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని అన్నారు. జగన్ పని అయిపోయిందని, జగన్ ప్రభుత్వంపై ప్రజలు ఫ్రస్టేషన్ లో ఉన్నారని అన్నారు. జగన్ రాజకీయాలు కనబడవని, రాబోయే ఎన్నికల్లో జగన్ చిత్తుచిత్తుగా ఓడిపోతాడని జోస్యం చెప్పారు. జగన్ జైలుకు పోతాడని బెయిల్ కూడా ఉండదని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.