విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగదాంబ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో వాలంటీర్ల వ్యవస్థ పై, సీఎం జగన్ పై సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి వాలంటీర్ల పై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ దండుపాళ్యం బ్యాచ్ లా తయారైందని పవన్ నిప్పులు చెరిగారు. ఒంటరి మహిళల గొంతులు కోస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. రుషికొండ సందర్శన నేపథ్యంలో తనపై విధించిన ఆంక్షలు వాలంటీర్లకు విధిస్తే అరాచకాలు ఉండవని జగన్ ప్రభుత్వానికి చురకలంటించారు.
పాస్పోర్ట్ అప్లై చేస్తే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కావాలని, వాలంటీర్ ఉద్యోగానికి కూడా అదే తరహాలో పోలీసు వెరిఫికేషన్ చేయాలని డిమాండ్ చేశారు. పెందుర్తిలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించిన పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వరలక్ష్మి చిత్రపటానికి నివాళులు అర్పించిన పవన్ వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేస్తే అధికార పార్టీ నేతల నుంచి స్పందన రాలేదని విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్ర, ప్రత్యేకించి విశాఖ నుంచి మహిళలు, పిల్లలు ఎక్కువ సంఖ్యలో అదృశ్యం అవుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఒకవేళ వ్యవస్థలో తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని హితవు పలికారు.
గొంతు కోసే దండుపాళ్యం బ్యాచ్ కు, వాలంటీర్ల బ్యాచ్ కు పెద్ద తేడా లేదని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వృద్ధులు, ఒంటరి మహిళలను, వితంతువులను వాలంటీర్లు టార్గెట్ చేస్తున్నారని, ఈ విషయాన్ని తాను గతంలో చెప్పానని పవన్ అన్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాలను, వాలంటీర్ల దురాగతాలను కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. నర్సీపట్నంలో కూడా ఒంటరి మహిళను వాలంటీర్ గర్భవతిని చేశాడని విమర్శించారు.
ఉత్తరాంధ్రలో చిన్నపిల్లలు అదృశ్యం అవుతున్నారని, లా అండ్ ఆర్డర్ బాగోలేదని విమర్శించారు. పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదని, వరలక్ష్మిని హతమార్చిన నిందితుడికి శిక్ష పడే వరకు జనసేన అండగా ఉంటుందన్నారు. వైసీపీ ఎంపీ ఎంవీవీ కుటుంబానికే విశాఖలో రక్షణ లేదని ఆరోపించారు. నవరత్నాల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ సైన్యం ప్రజల ప్రాణాలు తీస్తుంటే ఎలా అని ప్రశ్నించారు.