విశాఖ జిల్లాలో వారాహి విజయ యాత్ర సందర్భంగా వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్ లా తయారయ్యారని, ఒంటరి మహిళల గొంతులు కోస్తున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. వాలంటీర్ ఉద్యోగానికి కూడా పోలీసులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. పెందుర్తిలో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని పవన్ పరామర్శించారు.
ఈ సందర్భంగా పవన్ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టారు. వరలక్ష్మి కుటుంబ సభ్యులను ఓదార్చిన పవన్…జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులను వాలంటీర్లు టార్గెట్ చేస్తున్నారని తాను గతంలో చెప్పానని గుర్తు చేశారు. ఈ దురాగతాలను కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకు వెళ్తానని అన్నారు. ఇక, ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా దృష్టిలో విశాఖ కీలక నగరం అని, దేశ భద్రతకు విశాఖ ఎంతో ముఖ్యమని వారు అనుకుంటున్నారని పవన్ చెప్పారు.
అటువంటి విశాఖలో అధికార పార్టీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబానికి రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఒక ఎంపీ తన భార్య, బిడ్డ, ఆడిటర్ కిడ్నాప్ అయితే ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నారని ఆరోపించారు. ప్రజలకు భద్రత కల్పించి భరోసానివ్వాల్సిన ఎంపీ తాను విశాఖలో ఉండలేనని హైదరాబాద్ కు తన వ్యాపారాలు షిఫ్ట్ చేసుకుంటానని చెప్పడం ఏమిటని మండిపడ్డారు.
చేతగాకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. విశాఖలో సీబీసీఎంసీ భూములను ఎంపీ ఎంవీవీ తన అధికార బలంతో కబ్జా చేశారని ఆరోపించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్రమ కట్టడాలను, భూకబ్జాలను బట్టబయలు చేస్తామని…అప్పుడు జగన్ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.