వారాహి యాత్ర సందర్భంగా వైసీసీ నేతలపై, ఆ పార్టీ అధినేత జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీపై పవన్ నిప్పులు చెరిగే వ్యాఖ్యలకు సీఐ అంజూ యాదవ్ చేసిన పని ఆజ్యం పోసింది. దీంతో, జనసేన నేత సాయిపై అంజూ యాదవ్ చేయి చేసుకుంటే..పవన్ పై చేసుకున్నట్లేనని పవన్ మండిపడ్డారు. అంతేకాదు, ఈ ఇష్యూను ఇంతటితో వదలకుండా స్వయంగా తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు పవన్ తిరుపతి వచ్చారు.
తిరుపతి పర్యటన కోసం రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన పవన్ కు జనసేన నేతలు, కార్యకర్తలు, పవన్ అభిమానులు ఘన స్వాగతం పలికారు.15 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీగా వెళ్లి సీఐ అంజూ యాదవ్ పై తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి పవన్ కంప్లయింట్ ఇచ్చారు. అంజూ యాదవ్ చేతిలో అవమానపడ్డ సాయితో పాటు మరికొందరు నేతలు కూడా పవన్ తో ఎస్పీ దగ్గరకు వెళ్లారు. అయితే, పవన్ రావడానికి ముందే అంజూ యాదవ్ ఘటనపై జిల్లా ఎస్పీ విచారణ నిర్వహించి డీజీపీకి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. తిరుపతిలో పవన్ కోసం వేలాదిమంది తరలిరావడంతో వైసీపీ నేతలు షాకయ్యారు.
ఈ క్రమంలోనే పవన్ పై వైసీపీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వినతి పత్రం ఇచ్చే సాకుతో తిరుపతిపై పవన్ దండయాత్ర చేశారని ఆయన విమర్శలు గుప్పించారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై దాడి చేస్తున్నామన్న రీతిలో పవన్ వచ్చారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యబద్ధమైన తమ పార్టీపై పవన్ లేనిపోని ఆరోపణలు, నిందలు వేస్తున్నాడని ఆరోపించారు. పగ, ప్రతీకారాలతో భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్న పవన్… తనను గెలిపిస్తే, సీఎం చేస్తే ప్రజలకు ఏం చేస్తానన్న సంగతి మాత్రం పవన్ చెప్పడం లేదని ఎద్దేవా చేశారు.