జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అన్నవరం నుంచి ప్రత్యేక పూజలు చేసి కత్తిపూడి బహిరంగ సభతో వారాహి యాత్రను మొదలుబెట్టిన పవన్….నిన్న తణుకు బహిరంగ సభ వరకు వైసీపీపై పదునైన విమర్శలు గుప్పిస్తూ దూసుకుపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా పవన్ చేస్తున్న వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జనసేనకు రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా పర్చూరు వైసీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసులు అలియాస్ స్వాములు జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో స్వాములు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వాములుకు కండువా కప్పి పార్టీలోకి పవన్ ఆహ్వానించారు. జనసేన బలోపేతం కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. అంతకుముందు బాపట్ల జిల్లా పందిళ్లపల్లి నుంచి వందలాది మంది అనుచరులతో మంగళగిరి కార్యాలయానికి స్వాములు వచ్చారు.
చీరాల ఎమ్మెల్యేగా ఆమంచి కృష్ణమోహన్ రెండుసార్లు గెలవడంలో ఆయన అన్నయ్య ఆమంచి స్వాములు పాత్ర ఎంతో కీలకం. అయితే ప్రస్తుతానికి ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో కొనసాగుతుండగా ఆయన సోదరుడు జనసేనలో చేరారు. సీనియర్ నేత కరణం బలరాం వైసీపీకి మద్దతు ఇచ్చిన తర్వాత చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ కు ప్రాధాన్యత తగ్గిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమంచి వర్సెస్ కరణం బలరాం కోల్డ్ వార్ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆయన సోదరుడు స్వాములు జనసేనలో చేరినట్టుగా తెలుస్తోంది.
అంతేకాదు, త్వరలోనే ఆమంచి కృష్ణమోహన్ కూడా జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయని, అందుకే ముందు తన సోదరుడు స్వాములును జనసేనలోకి పంపారని తెలుస్తోంది. బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జనసేన అండగా ఉంటుందని, అటువంటి పార్టీలో చేరడం తన అదృష్టమని స్వాములు అన్నారు. ఏపీకి పవన్ వంటి వ్యక్తి సీఎం కావాల్సిన అవసరం ఉందని, తామంతా ఆయన వెనుక నడుస్తామని చెప్పారు.