ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ గెలుపు పవనాల జోరు కనిపిస్తోందని అంటు న్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ మరో సారి పోటీకి రెడీ అయిన నేపథ్యంలో ఇక్కడి రాజకీయ వాతావరణం ఆయనకు అనుకూలంగా మారిందనే సంకేతాలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఆయన అధ్యయనం చేయడంతోపాటు.. సమస్యలపైనా పోరాటం చేస్తున్నారు.
ఇటీవల వైసీపీకి చెందిన కీలక నాయకులను ఆయన టీడీపీ వైపు తీసుకువచ్చారు. చంద్రబాబు సమక్షం లో పార్టీలో చేర్చుకున్నారు. అదేసమయంలో రైతాంగ సమస్యలు సహా కార్మికులు.. ఇతర సామాజిక వర్గాల సమస్యలపై ఆయన గళం వినిపిస్తున్నారు. నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు. ఈ పరిణామాలతో అవనిగడ్డ నియోజకవర్గంలో మండలి గెలుపు నల్లేరుపై నడకేనని కొందరు టీడీపీ నాయకులు చెబుతు న్నారు. మరికొందరు మాత్రం టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ.. గెలుపు తమదేనని వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తంగా ఎలా చూసుకున్నా.. అవనిగడ్డ విజయం తథ్యమనే టీడీపీ నాయకుల సంఖ్య పెరుగుతోంది. ఇదిలావుంటే, మండలి కుమారుడు కృష్ణారావు కూడా ప్రజల మధ్యే ఉంటున్నారు. వాస్తానికి ఆయనకే టికెట్ ఇవ్వాలని బుద్ధ ప్రసాద్ కోరుకున్నా.. వచ్చే ఎన్నికల్లో ఉన్న పోటీని దృష్టిలో పెట్టుకుని బుద్ధ ప్రసాద్‌కే చంద్రబాబు జైకొట్టారు. దీంతో బుద్ధ ప్రసాద్ ప్రజల్లోనే ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకుం టున్నారు.
ఇక, పార్టీలో కీలకమైన నాయకులను కూడా ఆయన ఏకతాటిపైకి తీసుకువచ్చారు. నిన్న మొన్నటి వరకు కూడా ఎవరికి వారుగా ఉన్న నాయకులను మండలి ఏకతాటిపైకి తెచ్చారు. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నారు. అదేసమయంలో వైసీపీ నుంచి అసంతృప్తులను టీడీపీలో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. దీంతో అవనిగడ్డ లో మండలి దూకుడు పెరిగిందనేటాక్ వినిపిస్తుండడం గమనార్హం.