రాజస్ధాన్లో కాంగ్రెస్ పార్టీ కొంపముణగటం ఖాయమనే అనిపిస్తోంది. కొంపముణగటం అంటే ఎన్నికల్లో ఓడిపోవటం కాదు. ఎన్నికలకు ముందే దాదాపు ఓడిపోవటమన్నమాట. కారణం ఏమిటంటే పార్టీ అగ్రనేతల మధ్య పెరిగిపోయిన చీలకలే. విషయం ఏమిటంటే కాంగ్రెస్ లో నుండి బయటకు వచ్చేసి ప్రగతిశీల్ కాంగ్రెస్ అని కొత్త పార్టీ పెట్టుకునే ఆలోచనలో సచిన్ పైలెట్ ఉన్నారట. సచిన్ పైలెట్ అంటే ఇపుడు రాజస్ధాన్ ప్రభుత్వంలో మంత్రి, పీసీసీ అద్యక్షుడు కూడా.
సచిన్ కు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు ఒక్క నిమిషం కూడా పడదు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవటానికి సచిన్ చాలా కష్టపడ్డారు. తీరా అధికారంలోకి రాగానే సడెన్ గా గెహ్లాట్ ముఖ్యమంత్రయిపోయారు. అప్పటినుండి వీళ్ళిద్దరికి పడటంలేదు. అవకాశం వచ్చినపుడల్లా సచిన్ ను గెహ్లాట్ దెబ్బకొడుతునే ఉన్నారు. దాంతో విసిగిపోయిన సచిన్ పార్టీపై తిరుగుబాటు చేశారు. తన మద్దతుదారులతో పార్టీని వదిలేయటానికి రెడీ అయితే రాహూల్, ప్రియాంకగాంధీలు నచ్చచెప్పారు.
ఇదంతా చరిత్రలో కలిసిపోయి రాబోయే ఎన్నికల్లో పోరాడేందుకు ఇద్దరిమధ్యా సయోధ్య కుదిర్చారు. అయితే ఏమైందో ఏమో కాంగ్రెస్ నుండి బయటకు వెళ్ళిపోయి వేరుకుంపటి పెట్టుకోవటానికి సచిన్ రెడీ అయినట్లు సమాచారం. ఈనెల 11వ తేదీన కొత్తపార్టీ ప్రకటించేందుకు సచిన్ ఏర్పాట్లు చేసుకున్నారట. 11వ తేదీ అంటే తన తండ్రి రాజేష్ పైలెట్ వర్ధంతి. ఆరోజు సచిన్ కీలక ప్రకటన చేయబోతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. కొత్తపార్టీ పెట్టేందుకు సచిన్ ఏర్పాట్లు చేసుకున్నట్లు సడెన్ గా బయటపడింది.
సచిన్ మద్దతుదారులు కూడా కాంగ్రెస్ తో సంబంధాలు లేనట్లుగానే వ్యవహరిస్తున్నారు. దాంతో ఈ విషయం పార్టీ అధిష్టానానికి పెద్ద షాక్ కు గురిచేసింది. ఈఏడాది చివరలో ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో సడెన్ గా జరిగిపోతున్న పరిణామాలు పార్టీ అగ్రనేతలకు మింగుడుపడటంలేదు. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలని అనుకుంటున్న పార్టీ ఎన్నికల ముందే చేతులెత్తేసేట్లుగా కనబడుతోంది. సచిన్ వెనకాల బీజేపీ వ్యూహం ఉందనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.