దివంగత మహా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు హైదరాబాద్లో అంగరంగ వైభవంగా సాగాయి. హైదరాబాద్లోని కూకట్పల్లి కైత్లాపూర్ మైదానంలో నిర్వహించిన శత జయంతి వేడుకల సభలో అన్న ఎన్టీఆర్ గారి తనయడు, నటసింహం బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన జన్మని తెలుగు జాతికి అంకితం ఇచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.
వందేళ్ల క్రితం వెలిగిన ఎన్టీఆర్ అనే వెలుగు వెయ్యేళ్లకు సరిపడా కాంతినిచ్చిందని బాలకృష్ణ అన్నారు. ‘‘ఎన్టీఆర్ కారణ జన్ముడు.. మహానుభావుడు. ఆయన పేరు తలచుకుంటేనే తెలుగు జాతి ఒళ్లు పులకరిస్తుం ది. ఎన్నో సాహసోపేతమైన పాత్రలు పోషించారు. ఆయన మహోన్నత నటన విశ్వవ్యాప్తమైంది. ఎన్టీఆర్ అంటే నటనకు ఒక గ్రంథాలయం. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత ఆయనదే. ఎన్టీఆర్ అంటే నూతన శకానికి ఆరంభం. సినిమా రంగంతో పాటు రాజకీయాల్లోనూ హీరో అనిపించుకున్నారు“ అని కొనియాడారు.
ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన తొలి వ్యక్తిగా ఎన్టీఆర్ను బాలయ్య పేర్కొన్నారు. ఆయన్ను స్ఫూర్తి గా తీసుకుని ఎంతో మంది రాజకీయాల్లో అడుగుపెట్టారని తెలిపారు. మహిళలకు రిజర్వేషన్లతో పాటు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని అన్నారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. మహిళలకోసం ప్రత్యేకంగా పద్మావతి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారని చెప్పారు.
ఇలా ఎన్నో సామాజిక సంస్కరణలు తెచ్చారని, మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్దేనని బాలయ్య పేర్కొన్నారు. ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనని నినదించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ అన్నారు. కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కమిటీ ఛైర్మన్ టి.డి. జనార్దన్తో పాటు సభ్యులను ఈ సందర్భంగా బాలకృష్ణ అభినందించారు.