సూపర్ హిట్ అయిన సినిమా కథాంశంతో కాకున్నా ఆ జోనర్ తో సినిమాలు తీసే ట్రెండ్ తెలిసిందే. పాతకాలం నాటి సూపర్ హిట్ సినిమా పోస్టర్ కు పొలిటికల్ మసాలా అద్ది పంచ్ రూపంలో పోస్టు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోస్టర్ సూపర్ హిట్ కావటం తెలిసిందే. సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ పవన్ కల్యాణ్ విడుదల చేసిన పోస్టర్ కు కౌంటర్ పోస్టును దర్శకుడు రాంగోపాల్ వర్మ పెట్టినా పెద్ద ప్రయోజనం లేకుండా పోయింది.
పాపం పసివాడు పోస్టర్ సంచలనంగా మారి.. పెద్ద ఎత్తున వైరల్ అయిన నేపథ్యంలో.. తిరుపతి జనసేన నేతలు తాజాగా మరో సంచలన పోస్టర్ ను విడుదల చేశారు. సజ్జల దర్శకత్వంలో దొంగలకు దొంగ పేరుతో పోస్టర్ విడుదల చేశారు. కొన్ని దశాబ్దాల క్రితం విడుదలైన ఈ సూపర్ హిట్ మూవీ పోస్టర్ ను.. తాజా రాజకీయాలకు అనుగుణంగా.. తాము టార్గెట్ చేయాలనుకున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ అండ్ కోను టార్గెట్ చేశారు.
ఈ సినిమాలో హీరో ముఖానికి బదులుగా సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖాన్ని మార్ఫింగ్ చేయటం.. ఇతర ఆర్టిస్టుల ముఖాలకు బదులుగా వైసీపీ ముఖ్యనేతలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయులుగా వ్యవహరించే కొడాలినాని.. సజ్జల రామక్రిష్ణారెడ్డి.. ఆర్కే రోజా.. అంబటి రాంబాబు.. పేర్ని నాని.. గుడివాడ అమర్నాథ్ ముఖాలను పోస్టర్ లో ఉంచారు. సజ్జల దర్శకత్వంలో దొంగలకు దొంగ అంటూ పేర్కొన్న ఈ మూవీని ఇడుపులపాయ ఎస్టేట్ అండ్ కో సమర్పించిందని పేర్కొన్నారు.
అంతేకాదు.. ‘‘మహామేత’’ దివ్య ఆశీస్సులతో విజయవంతంగా ప్రదర్శించబడుతోందని వ్యంగ్య వ్యాఖ్య అచ్చేశారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. పోస్టర్ కు కుడివైపుకింది బాఘంలో మాటలు.. సంగీతం.. కథ లాంటి వాటిని తొలగించకుండా ఒరిజినల్ మూవీలో ఉన్న వారి పేర్లను యధాతదంగా ఉంచేశారు. అలా కాకుండా వారి పేర్లను తొలగించి ఉంటే బాగుండేది. పవన్ మొదలుపెట్టిన ఈ పోస్టర్ రచ్చ.. రానున్న రోజుల్లో ఈ పోస్టర్ రచ్చ అంతకంతకూ ముదిరిపోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.