సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తీరు ఇటీవల రాజకీయవర్గాలలో చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులను విచారించి జగన్‌ను అరెస్ట్ చేసిన అధికారిగానే తెలుగు రాష్ట్రాలలో ఆయన పాపులర్. కానీ, ఇప్పుడు లక్ష్మీనారాయణ అదే జగన్‌ను అభినందిస్తూ ట్వీట్ చేయడం.. వైసీపీ నుంచి కూడా తన పొలిటికల్ ఆఫర్లు ఉన్నాయని ఇటీవల చెప్పడం చూస్తుంటే జేడీ వచ్చే ఎన్నికలలో వైసీపీ గూటికి ఏమైనా చేరుతారా అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.
నిఖార్సైన అధికారిగా, సమాజానికి మంచి చేయడానికి కచ్చితమైన ప్రణాళికలున్న వ్యక్తిగా లక్ష్మీనారాయణ అందరికీ తెలుసు. అయితే, ప్రజలకు మంచి చేయడానికి పదవి అవసరమని ఆయన గట్టిగా నమ్ముతారు. ఈ క్రమంలోనే ఆయన ఎలాగైనా ఎంపీ కావాలనుకుంటున్నారని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. అయితే, 2019లో విశాఖ నుంచి జనసేన తరఫున ఆయన లోక్ సభకు పోటీ చేసినా గెలవలేదు. అనంతరం జనసేన నుంచి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేని లక్ష్మీనారాయణ ఇటీవల జగన్ ప్రభుత్వం చుక్కల భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం ఎత్తివేసిన సందర్భంలో జగన్ నిర్ణయాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు.
నిజానికి ఈ ట్వీట్లో ఎలాంటి తప్పు లేదు. చుక్కల భూముల రిజిష్ట్రేషన్ల విషయంలో జగన్ నిర్ణయాన్ని మెచ్చుకోవడంలో ఎలాంటి తప్పు లేదు.
ప్రభుత్వం ఏదైనా మంచి పనిచేసినప్పుడు, ప్రజలకు ఉపయోగపడే పనిచేసినప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రశంసించడం మంచి పద్ధతే. అయితే, తాజా రాజకీయ పరిస్థితులు, ఇంతకుముందు ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పిన విషయాల నేపథ్యంలో ఇప్పుడు ఆయన ట్వీట్ రాజకీయంగా చర్చకు దారితీసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన జేడీ లక్ష్మీనారాయణ గతంలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణాధికారిగా రావడంతో ఆయన పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. సీబీఐ జేడీగా వైఎస్ జగన్‌ను విచారించడం.. అనంతరం జగన్‌ను అరెస్ట్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో జేడీ లక్ష్మీనారాయణ పేరు మార్మోగిపోయింది. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో వీఆర్ఎస్ తీసుకున్న లక్ష్మీనారాయణ 2019 ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
అనంతరం జనసేనకు గుడ్ బై చెప్పేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తనకు అటు వైసీపీతోపాటు ఇటు బీఆర్ఎస్ ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నట్లు ఇటీవలే వీవీ లక్ష్మీనారాయణ వెల్లడించిన సంగతి తెలిసిందే. లక్ష్మీనారాయణ చేసిన ఆఫర్ల ప్రకటనకు, ఈ ట్వీట్‌కు జనం ఇప్పుడు ముడిపెడుతున్నారు.
వచ్చే ఎన్నికలలో లక్ష్మీనారాయణ విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేయాలనుకుంటున్నారని.. అందుకోసం పార్టీల మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఆయన వైసీపీలో నేరుగా చేరకపోయినా ఆ పార్టీ మద్దతు తీసుకుని వైజాగ్‌లో గెలవాలని ప్లాన్ చేస్తున్నారని.. అందులో భాగమే ఈ జగన్ సానుకూల ధోరణి అని అంటున్నారు.