కర్ణాటకలో బీజేపీ ఓటమిని పరిశీలిస్తే.. కర్ణుడి చావుకు అన్నట్టుగా.. ఎన్నికారణాలు ఉన్నా.. రెండు కీలక అంశాలు ప్రధానంగా ప్రభావం చూపించాయని అంటున్నారు పరిశీలకులు. ఒకటి అవినీతి-రెండు అమూల్ పాలు. ‘పే సీఎం’.. ’40 శాతం సర్కారు’.. ‘కమీషన్ల మంత్రులు’.. కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ సంధించిన అస్త్రాలివి. రాష్ట్రంలో అవినీతి తీవ్ర స్థాయికి చేరిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ చేసిన ప్రచారం.
ప్రతి పనికీ బీజేపీ సర్కారు 40 శాతం కమీషన్ తీసుకుంటోందని రాహుల్‌గాంధీ సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇది ఎన్నికల్లో బీజేపీని బాగా ఇబ్బంది పెట్టింది. ఈ ఆరోపణలను తిప్పికొట్టడం మినహా గట్టిగా సమాధానాలు చెప్పుకోలేకపోయింది. అవినీతితో పాటు అనేక అంశాల్లో బీజేపీ సర్కారుకు ఎదురుగాలి వీచింది. చివరకు గుజరాత్ కు చెందిన ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్(అమూల్) పాల వ్యవహారం సైతం రాష్ట్రంలో దుమారం రేపింది.
అవినీతి కారణంగా.. ప్రజలను దోచుకుంటున్నారని.. అమూల్ పాలతో స్థానిక పాడిరైతుల పొట్టగొడుతు న్నారని కాంగ్రెస్ పెద్ద ఎత్తన ప్రజల్లోకి తీసుకువెళ్లింది. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ‘స్థానికత’ అస్త్రం ముందు బీజేపీ నిలబడలేక పోయింది. ఫలితంగా పార్టీ 65 స్థానాలకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణాలు అనేకం ఉన్నా.. ఇవి అత్యంత కీలకంగా మారాయి.
ఇక, ఏపీ విషయానికి వస్తే.. ఈ రెండు విషయాలు ఇక్కడ కూడా తీవ్రప్రభావం చూపుతాయని అంటున్నా రు పరిశీలకులు. ఎందెందు చూసిన.. అందందే అవినీతి అన్నట్టుగా ఉందని.. టీడీపీ అదినేత చంద్రబాబు పదే పదే ప్రజలను హెచ్చరిస్తున్నారు. ప్రజల్లోకి వైసీపీ నేతలు అవినీతి చేస్తున్నారనే విషయాన్ని బలంగా తీసుకువెళ్తున్నారు.
మరోవైపు.. ఏపీలోనూ గుజరాత్‌కు చెందిన అమూల్‌ను బలవంతంగా రుద్దడమే కాకుండా.. ఈ సంస్థకు ప్రభుత్వం ఎదురు పెట్టుబడి పేట్టడం కూడా గ్రామీణ స్థాయిలో చర్చకు వస్తోంది. అంతేకాదు.. దీని కోసం. స్థానికంగా ఉన్న పాల ఉత్పత్తుల సంస్థలను అణిచేస్తున్నారని.. కేసులు పెడుతున్నారనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు విషయాలు ఏపీలోనూ ప్రభావం చూపించే అవకాశం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరుస్తుందో లేదో చూడాలి.