ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు అంటే చాలు రాష్ట్ర ప్రజలు బెంబెలెత్తుతున్నారు. ఆయన పర్యటనలకు, బహిరంగ సభలకు అడ్డొస్తే.. ఏవైనా సరే అడ్డులేకుండా అధికారులు తొలగిస్తున్నారు. ఈరోజు విశాఖలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో దుకాణాలు, హోటళ్లు బంద్ చేయడం.. ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడం, చెట్లను కొట్టేయడం, చెత్తాచెదారం కనిపించకుండా రోడ్ల పక్కన అడ్డు తెరలు కట్టడం లాంటి పనులు పలు విమర్శలకు తావిస్తోంది.
సీఎం జగన్ పీఎం పాలెంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం బి-మైదానంలో వైఎస్సార్ విగ్రహ ఆవిష్కర ణలో పాల్గొంటారు. ఎయిర్‌పోర్టు నుంచి స్టేడియానికి హెలికాప్టర్లో చేరుకునేందుకు బి-గ్రౌండ్లో కొత్తగా హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. అయితే దీనికి దూరంగా గోడ పక్కన ఉన్న ఆరు భారీ చెట్లను అధికారులు కొట్టేయించారు.
అయితే స్టేడియం నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే రుషికొండ వద్ద హెలీప్యాడ్ ఉన్నా.. కొత్తగా బి-గ్రౌండ్లో క్రికెట్ పిచ్ పక్కనే హెలీప్యాడ్ ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ క్రికెట్ స్టేడియం బి-గ్రౌండ్ నుంచి ఏ-గ్రౌండ్‌కు వెళ్లేందుకు ప్రాంగణంలోనే ప్రత్యేకంగా రోడ్డు నిర్మించారు. ఏ-గ్రౌండ్లో కార్యకర్తలతో సమావేశం అనంతరం అక్కడ నుంచి నేరుగా జాతీయ రహదారి పైకి సీఎం కాన్వాయ్ వెళ్తుంది.
అక్కడి నుంచి 50 మీటర్లు ముందుకెళితే సిగ్నల్ వద్ద యూటర్న్ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, పోలీసులు అత్యుత్సాహంతో జాతీయ రహదారి డివైడర్లు తొలగించి.. నేరుగా అవతలి రోడ్డులోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. సుమారు 30 మీటర్ల మేర డివైడర్‌ను తొలగించారు. మళ్లీ దానిని కట్టాలంటే 2 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. అయినా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా.. వ్యవహరించడం గమనార్హం.