వైసీపీ అధినేత జగన్ ఆశలు ఫలించనున్నాయంటూ.. వైసీపీలోని ఓ వర్గం నాయకులు సంబరాలు చేసు కుంటున్నారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో గత చంద్రబాబు పాలనలో జరిగిన కార్యక్రమాలు, ప్రాజెక్టులపై సిట్ విచారణకు అడ్డంకిలేకుండా పోయిందని.. దీంతో చంద్రబాబు మెడకు విచారణ ఉచ్చు బిగుసుకుంటోందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కీలక సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కూడా చెప్పారు.
అవసరమైతే..చంద్రబాబుసైతం జైలుకు వెళ్లే పరిస్థితి ఉంటుందని అన్నారు. అంటే..దీనిని బట్టి.. వైసీపీ వ్యూహం ఎన్నికల నాటికి చంద్రబాబును జైలుకు పంపించేలా ఉందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. సరే.. ఇదే జరిగితే ఎవరికి నష్టం.? ఎవరికి కష్టం? అనేది ఆసక్తిగా మారింది. నిజానికి చంద్రబాబుకు క్లీన్ ఇమేజ్ ఉంది. నిజంగానే ఆయన ఏదైనా తప్పు చేశారని వైసీపీ నేతలు చెప్పినా.. ప్రభుత్వం చెప్పినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
ఎందుకంటే.. ఇప్పటి వరకు ధూళిపాళ్ల నరేంద్ర నుంచి అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర వంటి వారిపై కేసులు పెట్టి(అవినీతి ఆరోపణలతో) వైసీపీ సాధించింది ఏమీ లేదు. పైగా అభాసుపాలైంది. అలాంటి నాయకులపైనే కేసులు నిలవనప్పుడు.. ప్రజలు నమ్మనప్పుడు చంద్రబాబు వంటి ప్రపంచస్థాయి ఇమేజ్ ఉన్న నాయకుడిని ఇరికించే ప్రయత్నం చేసి.. వైసీపీ ఇబ్బందుల్లో పడుతుందని అంటున్నారు పరిశీలకులు.
ఎందుకంటే.. చంద్రబాబు పర్యటనలు, నారా లోకేష్ యువగళం పాదయాత్రలను అడ్డుకున్నప్పుడు వైసీపీ ఇమేజ్ పడిపోయి.. అదేసమయంలో టీడీపీ గ్రాఫ్ పుంజుకుంది. చంద్రబాబు సభలను, కార్యక్రమాలను ఉద్దేశ పూర్వకంగానే అడ్డుకుంటున్నారని ప్రజలు సైతం చర్చించుకున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాతే ప్రభుత్వం చంద్రబాబు సభలకు దాదాపు అడ్డు లేకుండా చేస్తోంది. ఇక, యువగళాన్ని సైతం సాఫీగా సాగేలా వ్యవహరిస్తోంది. సో.. ఈ విషయంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు..చంద్రబాబుపై కేసులు పెట్టి.. సుప్రీం తీర్పు వచ్చిందని రెచ్చిపోతే.. సింపతీ పోయి.. ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టే అవుతుందని అంటున్నారు పరిశీలకులు.