జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తన పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంచలన పిలుపునిచ్చారు. “సైనికులూ అప్రమత్తంగా ఉండండి“ అని ఆయన తేల్చి చెప్పారు. జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని.. మాట్లాడేముందు వాస్తవాలను నిర్ధారించుకోవా లని అన్నారు. ఈ మేరకు జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులకు పవన్ బహిరంగ లేఖ రాశారు.
“ఏపీ అభివృద్ధి, ప్రజాశ్రేయస్సు కోసం మనం శ్రమిస్తున్న తరుణంలో మన దృష్టి మళ్లించేందుకు, భావజాలాన్ని కలుషితం చేసేందుకు కొన్ని శక్తులు నిరంతరం పనిచేస్తున్నాయి. మన పార్టీ పట్ల ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బతీసే కల్పిత సమాచారాన్ని శ్రేణులకు చేర్చి కుట్రలకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉంది. వాటిని మనం అర్థం చేసుకుని పార్టీ నాయకులు, శ్రేణులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది“ అని పవన్ పేర్కొన్నారు.
ప్రతి విమర్శలు, తీవ్రమైన ఆర్థిక నేరాల గురించి మాట్లాడాల్సి వచ్చినపుడు ముందుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ఎవరు మాట్లాడాల్సి వచ్చినా.. పార్టీ పెద్దల సూచనలు, సలహా మేరకు మాట్లాడాలని తేల్చి చెప్పారు. పార్టీలోని నాయకులు, వీరమహిళలు, జన సైనికులు మాట్లాడే ప్రతి మాట పార్టీపై ప్రభావం చూపుతుందన్నారు. అందుకే పార్టీలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరిస్తూ మాట్లాడే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని పవన్ సూచించారు. స్థాయి, తీవ్రత హద్దులు దాటినట్లు సభ్య సమాజం భావించని విధంగా మన మాటలు ఉండాలని దిశానిర్దేశం చేశారు.
ఎందుకీ అప్రమత్తత?
జనసేన అధినేత పవన్ ఒక్కసారిగా ఇలా ఎందుకు అప్రమత్తమయ్యారనేది ఆసక్తిగా మారింది. ఇటీవల పుష్ప సినిమాకు సంబంధించి నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ సమయంలో విశాఖకు చెందిన జనసేన నేత ఒకరు.. ఈ సినిమాలో వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన వియ్యంకుడు కూడా పెట్టుబడులు పెట్టారని విమర్శలు గుప్పించారు. కాబట్టి ఐటీ అధికారులు వీరిద్దరి ఇళ్లలోనూ దాడులు చేయాలని ఆయన సూచించారు. ఇది రాజకీయంగా దుమారానికి దారి తీసింది. ఈ ఆరోపణలను నిరూపించాలని బాలినేని సవాల్ రువ్వారు. లేకపోతే.. పార్టీపైనా.. నేతలపైనా పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ ఈ హెచ్చరిక లేఖ రాయడం గమనార్హం.