ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి రాష్ట్రంలో పోలీసుల తీరు పలుమార్లు వివాదాస్పదం అయింది.
అధికార పార్టీ చేతుల్లో పావులుగా మారిన పోలీస్ బాస్‌లు.. ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అనేక సందర్భాల్లో హద్దులు దాటి వ్యవహరించిన తీరు చర్చనీయాంశం అయింది.
పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ప్రతి ప్రభుత్వంలోనూ ఉండేదే కానీ.. గత నాలుగేళ్లలో మాత్రం ఖాకీలు మరీ శ్రుతి మించి వ్యవహరించడం.. పలు సందర్భాల్లో కోర్టుల నుంచి మొట్టికాయలు వేయించుకోవడం తెలిసిందే.
తాజాగా ఒక తెలుగుదేశం మద్దతుదారు అయిన ఎన్నారైని పోలీసులు టార్గెట్ చేస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదం అవుతోంది.
ఆ ఎన్నారై పేరు అంజన్.
అతను యుఎస్‌లో ఎమ్మెస్ చేసి అక్కడే కొన్నేళ్లు ఉద్యోగం చేసి.. తిరిగి తన స్వస్థలం అయిన ఏపీకి వచ్చేశాడు.
స్వతహాగా టీడీపీ సపోర్టర్ అయిన అంజన్.. ట్విట్టర్లో అంజన్ యువగళం పేరుతో అకౌంట్ నడుపుతూ తెలుగుదేశంకి మద్దతుగా, అలాగే వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడు.
టీడీపీకి ఉన్నట్లే వైసీపీకి కూడా సోషల్ మీడియాలో ఇలాంటి సపోర్టర్స్ ఉన్నారు.
వైసీపీ వాళ్లు ఎంత జుగుప్సాకరమైన పోస్టులు పెడతారో, ఎలాంటి బూతులు వాడతారో చెప్పాల్సిన పని లేదు.
టీడీపీలో కూడా ఇలాంటి వాళ్లు లేరని చెప్పలేం కానీ.. వైసీపీ వాళ్లు ఈ విషయంలో ఎప్పుడూ రెండాకులు ఎక్కువే చదివి ఉంటారు.
ఐతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వైసీపీ నేతలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నాడంటూ అంజన్‌ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంత వరకు బాగానే ఉంది. కానీ.. అంజన్ వ్యక్తగత జీవితం గురించి ఎస్పీ స్థాయి అధికారి మీడియాకు చెప్పిన విషయాలు, సాక్షి మీడియాలు రాసిన రాతలే దారుణంగా ఉన్నాయి.
అంజన్ గే అని, అతడి మొబైల్లో గే వీడియోలు, చాట్స్ ఉన్నాయని ఎస్పీ ప్రెస్ మీట్లో చెప్పడం.. దాని గురించి సాక్షి రాయడం తీవ్ర అభ్యంతరకరం.
నిజానికి అంజన్ స్వలింగ సంపర్కుడా కాదా అన్నదాని మీదే సందేహాలున్నాయి.
ఒకవేళ అది నిజమే అయినా.. పూర్తిగా వ్యక్తిగత విషయం.
అతడి మీద అభియోగాలకు, దీనికి అసలు సంబంధమే లేదు.
వ్యక్తిగత గోప్యత పాటించకుండా అంజన్ గే అని ప్రకటించడం.. వ్యక్తిగత విషయాలను బహిరంగపరచడం.. ప్రెస్ మీట్లో చట్ట విరుద్ధంగా మాట్లాడటం ఎంత వరకు కరెక్ట్ అన్నది ప్రశ్న?
ఇది వ్యక్తిత్వ హననం కిందికే వస్తుంది.
బెయిల్ మీద బయటికి వచ్చిన అంజన్ఈ, విషయాల్లో పోలీసుల మీద కేసులు పెట్టి పోరాడితే కోర్టుల్లో ఖాకీలతో పాటు సాక్షి మీడియాకు కూడా చిక్కులు తప్పవు.