దేశ ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలు.. ఆయన చదివిన డిగ్రీలను బయటపెట్టాలంటూ కోరిన ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ ను గుజరాత్ హైకోర్టు కొట్టేయటమే కాదు.. ఆయనకు రూ25వేల జరిమానా విధిస్తున్నట్లుగా పేర్కొంది. ఈ తీర్పుపై అప్పీలుకు అవకాశం లేకుండా చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీ.. పీజీలు చదివిన డిగ్రీలను బయటపెట్టాలన్న డిమాండ్ లో అర్థం లేదని తేల్చింది. ఈ మేరకు ఏడేళ్ల క్రితం కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాల్ని సైతం కొట్టేసిన కోర్టు.. ఢిల్లీ ముఖ్యమంత్రికి జరిమానా విధించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్హతలకు సంబంధించిన పత్రాల్ని చూపించాలంటూ కేంద్ర సమాచార కమిషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అధికారిక సమాచారం ప్రకారం 1978లో గుజరాత్ వర్సిటీ ద్వారా గ్రాడ్యుయేషన్.. 1983 ఢిల్లీ వర్సిటీ ద్వారా పీజీ చేసిన దానికి సంబంధించి పత్రాలను చూపాలంటూ కేజ్రీవాల్ కోరుతున్నారు.
కేజ్రీవాల్ దరఖాస్తు నేపథ్యంలో సదరు పత్రాల్ని చూపించాలంటూ పీఎంవోను.. కేంద్ర సమాచార కమిషనర్ ఆదేశించారు. పీఎంవోతో పాటు సదరు వర్సిటీలు కూడా వివరాలు వెల్లడించాలని కోరారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో సీఐసీ ఆదేశాలపై అప్పట్లో హైకోర్టు స్టే ఇచ్చింది. తాజాగా ఈ కేసు విచారణ తాజాగా తెర మీదకు వచ్చింది. దీనిపై గత నెలలో విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో.. ఆ అవసరం లేదని తేల్చింది.
గుజరాత్ వర్సిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. మోడీ విద్యార్హతల్ని దాచి పెట్టాల్సిన అవసరం లేదని.. ఇప్పటికే పబ్లిక్ డొమైన్ లో ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ వివరాల్ని ప్రత్యేకంగా బయటపెట్టాల్సిన అవసరం లేదన్నారు. ఒక బాధ్యతారహితమైన అత్యుత్సాహానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు. దీనికి కేజ్రీవాల్ తరఫు న్యాయవాది ఖండిస్తూ.. సదరుపత్రాలు ఇంటర్నెట్ లో అందుబాటులో లేవని పేర్కొన్నారు.
ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తాజాగా తీర్పును ఇస్తూ.. మోడీ సర్టిఫికేట్లను పీఎంవో కానీ.. వర్సిటీలు కానీ చూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఈ పత్రాలు కోరిన కేజ్రీవాల్ కు రూ.25వేలు ఫైన్ వేసి.. వాటిని నాలుగు వారాల్లో చెల్లించాలని పేర్కొంది. దీనిపై తదుపరి విచారణకు వీల్లేని రీతిలో ఆదేశాలు జారీ చేసింది.