ఆంధ్రుల కలల రాజధాని అమరావతి వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఇటు ఏపీ ప్రభుత్వం, అటు అమరావతి రైతులు వేరువేరుగా పిటిషన్ లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అమరావతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా, మరోవైపు తమకు న్యాయం చేయాలని అమరావతి రైతులు వేరువేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ పిటిషన్లపై సుప్రీంకోర్టులో చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ సత్వరమే విచారణ చేయాలని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోరడంపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈరోజు సుప్రీంకోర్టులో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కేసు విచారణ జరుగుతోంది. ఆ విచారణ మధ్యలో ఉండగానే భోజన విరామ సమయం వచ్చింది.
జస్టిస్ జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ద్విసభ్య ధర్మాసనం ముందుకు లంచ్ బ్రేక్ తర్వాత ఇతర కేసులు, అంశాలకు సంబంధించిన మెన్షనింగ్ వచ్చాయి. ఈ సందర్భంగా తమ కేసు విచారణ మొదలుబెట్టాలంటూ ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోరారు. దీంతో, సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ముంబై కార్పొరేషన్ కేసు విచారణ సగంలో వదిలేసి ఈ కేసు విచారణకు స్వీకరించమంటారా అంటూ జస్టిస్ జోసెఫ్ అసహనం వ్యక్తం చేశారు. జులై 11వ తేదీన అమరావతి అంశాన్ని తొలి కేసుగా విచారణకు తీసుకుంటామని వెల్లడించారు.
ఇక, అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. మరోవైపు, రాజధాని పిటిషన్ దారులలో కొందరు రైతులు మరణించారని, వారి స్థానంలో ప్రతినిధులు ప్రతివాదులుగా చేర్చేందుకు అనుమతించాలని వారి తరఫు లాయర్లు కోరారు. వారి కోరికను న్యాయస్థానం సమ్మతించి రైతుల ప్రతినిధులకు నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వంతరపు న్యాయవాదులకు స్పష్టం చేసింది. ఏదేమైనా సుప్రీం తాజా ఆదేశాలతో అమరావతి రైతులకు కాస్త ఊరట లభించగా…జగన్ సర్కార్ కు షాక్ తగిలినట్లయింది.