ఏపీలో మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షం టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం పట్ల ఎన్నారై టీడీపీ కో ఆర్డినేటర్ జయరాం కోటమి హర్షం వ్యక్తం చేశారు.
విజయం సాధించిన అభ్యర్థులకు పేరు పేరునా ఆయన అభినందనలు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వ ప్రలోభాలు, కేసులు, ఒత్తిళ్లను కూడా తట్టుకుని.. విజయం సాధించడం వెనుక పార్టీ నేతల కృషి.. ప్రజల ఆశీర్వాదం మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రజాభిప్రాయానికి నిలువుటద్దంగా నిలిచే మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడూ కూడా టీడీపీ ఖాతాలో పడ్డాయి.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు, తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు.
ఉత్తరాంధ్ర స్థానంలో విజయానికి అవసరమైన ఓట్లలో 90శాతం తొలి ప్రాధాన్యంలోనే సాధించిన చిరంజీవిరావు.. మిగిలిన ఓట్లను రెండో ప్రాధాన్యంలో దక్కించుకున్నారు.
తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు.
ఏడు రౌండ్లలో 2 లక్షల 69 వేల 339 ఓట్లు పోలవ్వగా రెండో ప్రాధాన్య ఓట్లతో కలిపి టీడీపీ అభ్యర్థి లక్షా 12 వేల 688 ఓట్లు సాధించారు.
వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డికి 85 వేల423 ఓట్లు వచ్చాయి.
ఇక, పశ్చిమ రాయల సీమలోనూ.. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి విజయం దక్కించుకోవడం గమనార్హం.
దీంతో ఎన్నికలకు ముందు టీడీపీ జెండా మూడు ప్రాంతాల్లోనూ రెపరెపలాడింది.
ఇదే విషయాన్ని పేర్కొంటూ.. జయరాం కోటమి టీడీపీ పుంజుకున్నదని చెప్పేందుకు, వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని నిరూపించేందుకు ఈ ఎన్నికలు ఉదాహరణగా ఆయన పేర్కొన్నా రు.
మొత్తం 9 లక్షల మంది ఎన్నికల్లో ఉన్నత విద్యావంతులు ఓట్లు వేశారని ఆయన తెలిపారు. చంద్రబాబు విజన్, అమరావతి రాజధానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు.
విశాఖను రాజధాని చేస్తామన్న వైసీపీ ఎత్తులు పారలేదని, ఉత్తరాంధ్రలో ఆ పార్టీ ఘోర పరాజయమే దీనికి నిదర్శనమని జయరాం కోటమి తెలిపారు.
టీడీపీ అభ్యర్థులకు మరోసారి అభినందనలు తెలిపిన జయరాం కోమటి.. పార్టీకి నూతనోత్తేజం వచ్చింది.
వచ్చే ఎన్నికల వరకు ఇదే హవా కొనసాగించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.