మీడియాను మించిపోయిన సోషల్ మీడియా పుణ్యమా అని ఇవాల్టిరోజున ఒకరి మీద ఒకరికి రాజకీయ నమ్మకం పూర్తిగా తగ్గిపోయింది. ఏం చెప్పినా.. ఎలాంటి మాట చెప్పినా.. అనుమానంతో చూడటం.. దాని వెనుక ఉన్న అసలు కారణమేంటి? అన్న సందేహాన్ని వ్యక్తం చేయటం అలవాటుగా మారింది. ఇదిలా ఉంటే.. గడిచిన కొంతకాలంగా సోషల్ మీడియా మరో పని చేస్తోంది. మీడియాకు మించిపోయి మరీ ఇన్ ఫ్లుయిన్స్ చేయటం ఎక్కువైంది. ఒక విషయాన్ని పది మంది కలిసి పందిని నందిని చేయాలన్నా.. నందిని పందిని చేయాలన్నా చాలా ఈజీగా మారింది.
దీంతో.. వ్యూహాత్మకంగా తమ వాదనల్ని వినిపిస్తూ తమ రాజకీయ ప్రత్యర్థులు తాము కోరుకున్నట్లుగా మార్చుకోవటం.. ప్రభావితం చేయటం.. వారి నోటి నుంచి తమకు అనుగుణంగా వ్యాఖ్యలు చేయించే ధోరణి ఎక్కువైంది. దీనికి తగ్గట్లే.. పేటీఎం.. ఫోన్ పే బ్యాచులు ఎక్కువైపోయాయి. తమకు వ్యతిరేకంగా ఉండే ఒక విషయాన్ని.. తెలివైన వాదనతో అవతలవారిని కన్ఫ్యూజ్ చేసేలా వాదనలు వినిపించి.. అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ధోరణి ఈ మధ్యన ఎక్కువైంది. తాజాగా ముగిసిన జనసేన ఆవిర్భావ సభ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందనుకోవాలి.
పవన్ తాజా వ్యాఖ్యల్ని గమనిస్తే.. తమ ప్రత్యర్థి జగన్ మీద కంటే కూడా తన మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న బీజేపీకి ఎక్కడో కాలేలా చేశారు. అక్కడితో ఆగారా? టీడీపీ మీద కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా చూస్తే.. అందరికి సమపాళ్లలో ఇవ్వాల్సినంత ఇచ్చేశారు. ఈ కారణంగానే కావొచ్చు.. ఆవిర్భావ సభ తర్వాత పవన్ మీద విరుచుకుపడే వైసీపీ నేతల్లో చాలామంది పెద్దగా రియాక్టు అయ్యింది లేదు. తమను మాత్రమే కాదు.. మిగిలిన వారందరిపైనా పంచ్ లు వేసిన క్రమంలో.. గట్టిగా తిట్టే అవకాశం లేకుండా పోయింది.
అదే సమయంలో వైసీపీకి చెందిన సోషల్ మీడియా విభాగం వారు చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. తాము విసిరిన ఉచ్చులో పవన్ ఇరుక్కున్నట్లుగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ మధ్యన ఒక మీడియా అధినేత తన కాలమ్ లో కేసీఆర్ నుంచి వెయ్యి కోట్ల రూపాయిల డీల్ పవన్ వద్దకు పంపారని పేర్కొన్నారు. పవన్ వద్దకు పంపటం వేరు.. దానికి పవన్ ఓకే చెప్పటం వేరు. పవన్ కు కేసీఆర్ పంపారనే మాట తప్పించి.. మరింకేమీ ప్రస్తావించలేదు. పవన్ ఇమేజ్ ను దెబ్బ తీయలేదు. ఆయన అంగీకరించారని కూడా రాయలేదు.
కానీ.. ఈ విషయాన్ని టేకప్ చేసిన వైసీపీ సోషల్ మీడియా వారు.. సదరు మీడియా అధినేత పవన్ ఇమేజ్ ను దెబ్బ తీసేలా.. చంద్రబాబుకు సరెండర్ అయ్యేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారంటూ జోరున ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి ప్రభావితమైన జనసేన వర్గీయులు.. పవన్ అభిమానులు సదరు మీడియా అధినేతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎప్పుడైనా తాను అనటమే తప్పించి.. తాను అన్న మాటలకు రెండోసారి వివరణ ఇచ్చే సదరు మీడియా పెద్ద సైతం.. తన తర్వాతి కాలమ్ లో ఈ అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి.. తాను అన్నది వేరని.. తాను అన్న దానికి సంబంధం లేని అంశాలతో.. వివరణలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తాను వివరణ ఇవ్వటం లేదని.. తప్పుగా ప్రచారం జరగటం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు.
ఆయన అంత ప్రయాస పడినా.. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రసంగించిన పవన్ కల్యాణ్.. సదరు మీడియా అధినేత పేరు కానీ.. ఆయన పబ్లికేషన్ పేరు కానీ.. ఆయన మాటల్ని కానీ ప్రస్తావించలేదు. కానీ.. వెయ్యి కోట్ల మాటను ప్రస్తావించి.. చెప్పు దెబ్బలు ఖాయమని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ వారికి ఆనందాన్ని ఇచ్చాయి. వారి సోషల్ మీడియా విభాగమైతే పండుగ చేసుకున్న పరిస్థితి.
దీనికి కారణం.. పవన్ ను తమ చేష్టలతో ప్రభావితం చేయటమే కాదు.. తాను అనుకున్నట్లుగా తిట్టించే విషయంలోనూ సక్సెస్ అయినట్లుగా వారు భావించటమే. మారిన పరిస్థితులకు అనుగుణంగా.. సోషల్ మీడియాలోట్రెండ్ అయ్యే అంశాలపై స్పందించే కంటే.. వాటి విషయంలో ఆచితూచి అన్నట్లుగా ఉంటే మంచిదంటున్నారు. ఒకసారి ట్రాప్ చేయగలిగిన వారు.. పదే పదే ట్రాప్ చేసే పరిస్థితి ఏర్పడితే.. పవన్ ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? అన్నది కూడా ఆయన ప్రత్యర్థులే ఫైనల్ చేసే ప్రమాదం ఉందన్నది మర్చిపోకూడదు.