ఏపీలోని వైసీపీ సర్కారుకు సెగ మొదలైంది. కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు.. ఉద్యోగులు.. ఉద్యమానికి రెడీ అయ్యారు. అది కూడా వెనువెంటనే ప్రారంభించడం గమనార్హం. ఏప్రిల్ 5వ తేదీ వరకు ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని.. జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యమ కార్యాచరణకు సంబంధించి 26 జిల్లాలకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ అయ్యారు.
పెన్‌డౌన్!!
ఏప్రిల్ 5వ తేదీ వరకూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతారు. ఉద్యమానికి మద్దతు కోరుతూ.. ‘ఉద్యోగులతో చేయి-చేయి కలుపుదాం’ అనే కార్యక్రమంతో ఈ నెల 17వ తేదీన, 20వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి నిరసన తెలుపుతారు. మార్చి 21న, 27వ తారీఖుల్లో కారుణ్య నియమకాలకు సంబంధించిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి. ఏప్రిల్ 5వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చకపోయి నా, ఏపీ జేఏసీ అమరావతి డిమాండ్లపై స్పందించకపోయినా పెన్‌డౌన్‌కు రెడీ అవుతారు.
ఇవీ.. ఉద్యోగుల డిమాండ్లు..
+ 11వ పీఆర్సీ పే స్కేల్‌పై ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
+ పీఆర్సీ బకాయిల కింద రూ.వేల కోట్లు ఇవ్వాలి.
+ ఉద్యోగులు దాచుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలి
+ ఈ నెలాఖరులోగా రూ.3 వేల కోట్లు చెల్లించాలి
+ తెలంగాణ తరహాలో పే స్కేల్ ఇవ్వాలి
+ సీపీఎస్ ఉద్యోగుల రూ.2,600 కోట్ల గురించి స్పష్టత ఇవ్వాలి
+ ఓపీఎస్ తప్ప మరో పింఛను విధానానికి ఒప్పుకునేది లేదు