కొద్ది నెలలుగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వర్సెస్ జగన్ ప్రభుత్వం అన్న రీతిలో మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమ డిమాండ్లు పరిష్కారం కాకుంటే త్వరలోనే నిరసనలు పెడతామని కొద్దిరోజుల క్రితం ప్రభుత్వానికి ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు అల్టిమేటం జారీ చేశారు. ఆ క్రమంలోనే ఏపీ సిఎస్ జవహర్ రెడ్డికి ఉద్యోగ సంఘాల నేతలు నోటీసులు కూడా ఇచ్చారు.
అయితే, ఆ నోటీసులు పట్ల ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఏపీలోని ఉద్యోగ సంఘాల నేతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేయబోతున్నామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సంచల ప్రకటన చేశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నామని, అయినా పట్టించుకోక పోవడంతోనే ఉద్యమానికి సిద్ధమయ్యామని ఆయన అన్నారు.
జగన్ ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకే ఆందోళన చేపట్టబోతున్నామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను నాలుగేళ్లుగా ఈ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. మార్చి 9 నుంచి ఏప్రిల్ 3 వరకు దశలవారీగా ఉద్యమం చేస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఏప్రిల్ 5న జరగబోయే కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యక్రమాలపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
చట్టబద్ధంగా తమకు రావాల్సిన, తాము దాచుకున్న డబ్బులు ఇవ్వడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయలు ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారని వాపోయారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు హామీ ఏమైందని నిలదీశారు. హామీ ఇవ్వని రాష్ట్రాలు కూడా దాన్ని రద్దు చేశాయని గుర్తు చేశారు. రాజకీయ నాయకుల పెన్షన్ విధానాన్ని రద్దు చేయగలరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.