ఓబుళాపురం మైనింగ్ కేసు వ్యవహారంలో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి గతంలో అరెస్టయి ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే. ఆ కంపెనీ నుంచి ముడుపులు స్వీకరించారంటూ శ్రీలక్ష్మిపై అభియోగాలు నమోదయ్యాయి. 2004-2009 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. మైనింగ్ లీజులు పొందేందుకు శ్రీలక్ష్మి సహకరించారని, అందుకోసం ఆమెకు భారీ మొత్తంలో ముడుపులు అందాయని ఆరోపణలు రావడంతో శ్రీలక్ష్మికి వ్యతిరేకంగా కేసు నమోదైంది.
ఈ క్రమంలోనే ఆ ఆరోపణలపై విచారణ జరిపిన సిబిఐ అధికారులు శ్రీలక్ష్మిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆ తర్వాత శ్రీలక్ష్మి బెయిల్ పై విడుదలయ్యారు. ఇక ఆ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఏపీకి జగన్ సీఎం కావడం, ఆమెను తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ చేయడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత శ్రీలక్ష్మిని నిర్దోషిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఆమెపై నమోదైన అభియోగాలను కొట్టివేసింది. ఆ అభియోగాలకు సరైన ఆధారాలు లేవని హైకోర్టు అభిప్రాయపడుతూ కేసు నుంచి ఆమె పేరును తొలగించింది.
అయితే, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సీబీఐ అధికారులు సవాల్ చేశారు. ఈ కేసు నుంచి శ్రీలక్ష్మి పేరును తొలగించవద్దంటూ సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఆ గనుల కేటాయింపులో శ్రీలక్ష్మి పాత్ర ఉందని పిటిషన్ లో పేర్కొంది. ఈ కేసులో ఆమెను విచారణ జరపాలని తెలిపింది. దీంతో, ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా, ఆ కేసు నుంచి ఊరట పొంది ఏపీ సీఎస్ రేసులో నిలిచిన శ్రీలక్ష్మికి….ఆమెను సీఎస్ చేసి రుణం తీర్చుకోవాలనుకున్న జగన్ కు తాజాగా సీబీఐ అధికారులు షాకిచ్చారని చెప్పవచ్చు.