తెలంగాణ తరహాలోనే ఏపీలోనూ బలపడాలని కేంద్రంలోని బీజేపీ కోరుకుంటుంటే ఏపీ బీజేపీ నేతలు మాత్రం రోజురోజుకూ పార్టీని బలహీనం చేస్తున్నారు. ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే టీడీపీ కండువా కప్పుకోవడం ఖాయంగా తెలుస్తోంది. ఏపీ బీజేపీలో ఎన్నికల రాజకీయాలు, పైస్థాయి రాజకీయ అనుభవం ఉన్న నేతలు ఒక్కరొక్కరుగా ఆ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం తరువాత టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ఉంటే వైసీపీ నుంచి ఇబ్బందులు ఉండవన్న ఉద్దేశంతో వీరు బీజేపీని ఆశ్రయించారు. అయితే, వీరిలో సుజన చౌదరి, టీజీ వెంకటేశ్‌ల రాజ్యసభ పదవీకాలం త్వరలో పూర్తి కానుంది.
వారికి బీజేపీ నుంచి మళ్లీ అవకాశం రావడం కష్టంగానే కనిపిస్తోంది. సీఎం రమేశ్ పదవీ కాలం పూర్తికావడానికి ఇంకా సమయం ఉంది.ఈ నేపథ్యంలో సుజన, టీజీలు తిరిగి టీడీపీలో చేరుతారని వినిపిస్తోంది. సుజన చౌదరి ఇప్పటికే చంద్రబాబుతో బాగా టచ్‌లో ఉన్నట్లు చెప్తున్నారు.
మరోవైపు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆదినారాయణ రెడ్డి, 2019లో ఓటమి పాలైన ధర్మవరం నేత గొనుగొంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి కూడా ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. వారు కూడా తిరిగి సొంత గూటికి రావాలనుకుంటున్నారట.
జమ్మలమడుగు నుంచి గతంలో గెలిచిన ఆదినారాయణ రెడ్డి ఈసారి కూడా అదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్నారట. జమ్మలమడుగులో వైఎస్ కుటుంబానికి చెందిన కీలక వ్యక్తి పోటీచేస్తారన్న ప్రచారం జరుగుతుండడం.. ఆదినారాయణ రెడ్డి అయితేనే ఎదుర్కోగలరని చంద్రబాబు కూడా భావిస్తున్నట్లు సమాచారం.
కన్నా చేరిన తరువాత ఒక్కరొక్కరుగా వీరు నలుగురు టీడీపీలో చేరుతారని ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.