ప్రతి ఇంటిపై జగన్ స్టిక్కర్ వ్యవహారం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం జగన్ పై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రజలంతా ‘మా దరిద్రం నువ్వే జగన్’ అంటున్నారని సంచలన విమర్శలు గుప్పించారు. అమరావతిని ఆపేసిన జగన్, రాజధాని కోసమంటూ బ్యాంకుల నుంచి రూ.3 వేల కోట్ల రుణాలు తీసుకున్నారని చురకలంటించారు.
అప్పుకట్టాలని సీఆర్డీఏ అధికారులను బ్యాంకర్లు నిలదీశారని, విశాఖ రాజధాని అని చెబుతున్న సీఎం…సీఆర్డీఏ ద్వారా అమరావతి ముసుగులో సిగ్గులేకుండా ఏ ముఖం పెట్టుకొని రూ.3,013 కోట్ల అప్పుచేశారని పట్టాభి నిలదీశారు. అమరావతి కట్టే ఆలోచనే లేని జగన్ అప్పు కోసమే బ్యాంకుల్ని మోసగించడం పెద్ద దరిద్రం కాదా అని ప్రశ్నించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను తలదన్నేలా జగన్ రెడ్డి ‘మోసగాళ్లకు మోసగాడు’అని ఎద్దేవా చేశారు.
2019-20 కాగ్ నివేదికలో సీఆర్డీఏ ద్వారా జగన్ తీసుకున్న అప్పుల వివరాలున్నాయని పట్టాభి సీఎం గుట్టురట్టు చేశారు. చంద్రబాబు హయాంలో సీఆర్డీఏకు క్రిసిల్ సంస్థ A(+) రేటింగ్ ఇచ్చిందని, కానీ, జగన్ రెడ్డి అసమర్థత, చేతగానితనంతో ఆ రేటింగ్ A(-)కి వచ్చేసిందని విమర్శించారు. వడ్డీ చెల్లించడానికి కూడా ప్రభుత్వ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ మెయింటెన్ చేయనందునే రేటింగ్ తగ్గిందని అన్నారు.
అప్పు చేసి తప్పించుకు తిరిగే జగన్ నిర్వాకం రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందని, చంద్రబాబు రాష్ట్రానికి తెచ్చిన పేరు ప్రఖ్యాతులను జగన్ దిగజార్చారని దుయ్యబట్టారు. జగన్ చేసే అప్పులన్నీ ఎప్పటికైనా జనం కట్టాల్సిందేనని అన్నారు. జగన్ మోసాలు చూసిన బ్యాంకులుభవిష్యత్లో రాష్ట్రానికి పైసా అప్పు ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు.