ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతి అంటూ లోక్ సభలో కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ పక్క జగన్ విశాఖ రాజధాని అని, అందరూ అక్కడికి రావాలని పిలుపునిస్తున్న నేపథ్యంలో కేంద్రం చేసిన ప్రకటన వైసీపీ నేతలకు మింగుడుపడడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. జగన్ ఆశలపై కేంద్రం నీళ్లు చెల్లిందని రఘురామ ఎద్దేవా చేశారు.
అయితే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదని, జగన్ కావాలనుకుంటే విశాఖ వెళ్ళొచ్చని రఘురామ అన్నారు. అవసరం లేని వారు కోటలో ఉన్నా, పేటలో ఉన్నా ఒకటేనంటూ చురకలంటించారు. రాజధాని విషయాన్ని పార్లమెంటులో లేవనెత్తిన ఎంపీ విజయసాయిరెడ్డిని అభినందిస్తున్నానని రఘురామ అన్నారు. విభజన చట్టం ప్రకారం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారని, ఇప్పుడు విశాఖ రాజధానిగా ప్రకటించాలంటే పార్లమెంట్లో చట్టం చేయాల్సి ఉంటుందని అన్నారు.
జగన్ డైరెక్షన్ లో సిఐడి పోలీసులు తనను దారుణంగా హింసించారని, రెండేళ్ల తర్వాత ఆ విషయంలో ఏపీ హైకోర్టు తనకు న్యాయం చేసిందని అన్నారు. తనను హింసించిన వారికి తాజాగా హైకోర్టు నోటీసులు జారీ చేసిందని అన్నారు. కష్ట సమయంలో తన ప్రాణాలకు ప్రతిపక్ష నేతలు అండగా ఉన్నారని, ముఖ్యంగా తనకు అండగా నిలిచిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు. తనను వేధించిన మాజీ సీఐడీ చీఫ్ సునీల్ ఇప్పుడు అమెరికాలో గోల్ఫ్ ఆడుకుంటుున్నారని సెటైర్లు వేశారు.