ఉమ్మడి కృష్ణాజిల్లా మరోసారి రాజకీయంగా రగులుతోంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కీలక నేతలను పోలీ సులు అరెస్టు చేయడం.. సోమవారం రాత్రంతా వారిని ఊరంతా తిప్పడం మరింత వివాదానికి దారితీ సింది. గుడివాడ, మచిలీ పట్నంలలో టీడీపీ నేతలను అరెస్టు చేయడం.. సంచలనంగా మారింది. వీరిలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేరావి వెంకటేశ్వరరావు ఉన్నారు. చిన్న చిన్న కారణాలతోనే వీరిని అరెస్టు చేయడం గమనార్హం.
గుడివాడలో ఏం జరిగింది..?
గుడివాడలో సోమవారం మధ్యాహ్నం నాగవరప్పాడులో పూరి గుడిసెలు తొలగిస్తుండగా అధికారులను టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అడ్డుకున్నారు. మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. గుడిసెలు ఎందుకు తొలగిస్తారో చెప్పాలన్నారు. ముందుగానే నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీంతో రావితో పాటు మరికొందరు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. సోమవారం రత్రంతా పమిడిముక్కల పోలీస్ స్టేషన్లోనే రావిని ఉంచారు. ఆయన నేలపైనే పడుకున్నారు. ఇక, మంగళవారం ఉదయాన్నే రావిని పోలీసులు అరెస్టు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారంటూ రావిపై సెక్షన్ 341 353 రెడ్ విత్ 149 కింద కేసులు నమోదు చేశారు.
మచిలీపట్నంలో ఇలా..
మచిలీపట్నంలో వైసీపీ జిల్లా కార్యాలయానికి ఇటీవల శంకుస్థాపన చేశారు. అయితే.. ఈ స్థలం వివాదంలో ఉందనే వార్తలు వచ్చాయి. దీంతోఈ స్థలాన్ని పరిశీలించేందుకు టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులతో కలిసి అక్కడకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. నగర నడి బొడ్డున వైసీపీ జిల్లా కార్యాలయానికి కోట్లు విలువ చేసే రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించగా రెండు రోజుల క్రితమే సదరు స్థలంలో కాంట్రాక్టర్ శంకుస్థాపన చేశారని కొల్లు ఆరోపించారు.
వైసీపీ జిల్లా కార్యాలయానికి స్థలం కేటాయింపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే..ఆయనను అడ్డుకున్న పోలీసులు…కొల్లు రవీంద్రతో పాటు టీడీపీ నేతలను బలవంతంగా అరెస్ట్ చేశారు. రవీంద్ర అరెస్ట్ సమయంలో జరిగిన పెనుగులాటలో ఓ మహిళా కార్యకర్త స్పృహ తప్పి పడిపోగా జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అరెస్ట్ అయిన రవీంద్రను పోలీస్ వాహనంలో పెడన, బంటుమిల్లి పోలీస్ స్టేషన్లకు తరలించి అక్కడ నుండి చివరిగా గూడూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మధ్యాహ్నం నుండి సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు రవీంద్రను గూడూరు పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై పలు సెక్షన్ల కింద రవీంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రవీంద్రకు వైద్య పరీక్షలు చేయించి కోర్టుకు తరలించారు. ఈ రెండు పరిణామాలు.. కీలక నేతల అరెస్టులు.. కృష్నా పాలిటిక్స్‌ను వేడెక్కించాయి.