టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్ ల భేటీపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేయబోతున్నాయని, ఆ విషయం గురించి చర్చించేందుకే వారిద్దరూ కలిశారని కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబును పవన్ 40 సీట్లు అడిగారని, వాటిపై ఇద్దరూ మాట్లాడుకున్నారని వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ నేతల విమర్శలపై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ స్పందించారు.
తమ శాఖల పురోగతిపై ఏనాడూ స్పందించని మంత్రులు ఈ భేటీపై మాత్రం కొంపలు మునిగిపోయినంత వేగంగా స్పందిస్తున్నారని చురకలంటించారు. చంద్రబాబు, పవన్ కాఫీకి కలిస్తే 12 మంది మంత్రులు స్పందించారని ఎద్దేవా చేశారు. ఇక ఇద్దరూ కలిసి భోజనం చేస్తే ఈ మంత్రులు ఏమైపోతారో! అంటూ చమత్కరించారు. ఇదంతా చూసి చంద్రబాబు, పవన్ కలవకూడదంటూ జీవో నెం.2 తీసుకువస్తారేమో అంటూ అనగాని సత్యప్రసాద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
హైదరాబాద్ లో పవన్, బాబుల రెండున్నర గంటల భేటీపై వైసీపీ నేతలు, సానుభూతిపరులు నానా రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. కుప్పంలో చంద్రబాబు పర్యటన అడ్డగింత, జీవో నెం.1 తదితర అంశాలపై వారివురూ చర్చించుకున్నారు. కానీ, పొత్తులపైనే వారిద్దరూ చర్చించుకున్నారంటూ మంత్రి అంబటి రాంబాబు సహా పలువురు విమర్శించారు. దీంతో, ఆ విమర్శలకు కౌంటర్ ఇస్తూ అనగాని ఇలా వ్యాఖ్యానించారు.